పుట:Oka-Yogi-Atmakatha.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గురుదేవులు శ్రీయుక్తేశ్వర్‌గారిని కలుసుకోడం

153

ఆశ్రమ సహవాసి చేసిన పరిహాసం ఇది. నేను దయానందగారి దగ్గరికి వెళ్ళాను; గంగానదివేపు ఉన్న తమ చిన్న గదిలో ఏదో పనిలో మునిగి ఉన్నారాయన.

“స్వామీజీ, ఇక్కడ నేను చెయ్యవలసింది ఏమిటో నాకు తెలియకుండా ఉంది. దేవుడి ప్రత్యక్ష దర్శనం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ఆయన లేనిదే, సాంగత్యంతోకాని, ధర్మంతోకాని, సత్కార్యాలతోకాని నాకు తృప్తి కలగదు.”

కాషాయవస్త్రధారి అయిన ఆ స్వాములవారు ఆప్యాయంగా నా వెన్ను తట్టారు. ఉత్తుత్తి కోపం నటిస్తూ, పక్కనున్న శిష్యుల్ని కొందర్ని మందలించారు. “ముకుందుణ్ణి ఇబ్బంది పెట్టకండి. మన పద్ధతులు క్రమంగా నేర్చుకుంటాడు లెండి.”

నేను మర్యాదగా నా సంశయాన్ని మరుగుపరిచాను. విద్యార్థులు గదిలోంచి వెళ్ళిపోయారు; ఆయన మందలింపుకి వాళ్ళేమీ కుంగిపోయినట్టు కనిపించలేదు. దయానందులు, ఆ తరవాత ఇంకా చెప్పారు నాకు.

“ముకుందా, మీ నాన్నగారు ప్రతినెలా వరస తప్పకుండా నీకు డబ్బు పంపిస్తున్నట్టున్నారు. ఆ డబ్బు ఆయనకి తిప్పి పంపెయ్యి; నీ కిక్కడ ఏమీ అక్కర్లేదు. ఇంక నీ క్రమశిక్షణ కోసం రెండో సూచన; అది నీ భోజనం గురించి. నీకు ఆకలి వేస్తున్నప్పుడు కూడా, ఆ సంగతి చెప్పకు.”

నా కంట్లో ఆకలి మిలమిల్లాడిందేమో నాకయితే తెలియదు. నాకు ఆకలిగా ఉందన్న సంగతిమట్టుకు బాగా తెలుసు. కాని ఆశ్రమంలో వేళ తప్పకుండా మొదటిసారి భోజనం పెట్టే సమయం మాత్రం మధ్యాహ్నం పన్నెండు గంటలు. మా ఇంట్లో అయితే తొమ్మిదిగంటల వేళకి సుష్టుగా ఫలహారం చెయ్యడం నాకు అలవాటు.