పుట:Oka-Yogi-Atmakatha.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

152

ఒక యోగి ఆత్మకథ

“చివరిసారిగా ఒక్క కోరిక కోరుతున్నాను. నన్నూ, నీకోసం తపించే అన్నదమ్ముల్నీ అక్కచెల్లెళ్ళనీ విడిచిపెట్టి వెళ్ళకు.” నాన్నగారి దీవెన కోసం నేను ఆయన ఎదుట నించునేసరికి ఆయన దిగాలుపడి ఇలా అన్నారు.

“నాన్నగారూ, మీ మీద నా కెంత ప్రేమ ఉందో ఎలా చెప్పగలను? కాని ఈ భూమిమీద నాకు పరిపూర్ణులైన తండ్రిని ప్రసాదించిన జగత్పిత మీదున్న ప్రేమ ఇంకా ఎక్కువయినది. ఇంతకంటే ఎక్కువ దివ్యమైన జ్ఞానం పొంది, ఎప్పుడో ఒకనాడు మళ్ళీ తిరిగిరావడానికి నన్నిప్పుడు వెళ్ళనియ్యండి.”

నాన్నగారు అనిష్టంగా ఇచ్చిన అనుమతితో, అప్పటికే కాశీలో ఆశ్రమంలో ఉన్న జితేంద్రని కలుసుకోడానికి బయల్దేరాను. నేను వెళ్ళగానే, ఆశ్రమాధిపతి అయిన స్వాములవారు - దయానందులు నన్ను సాదరంగా పలకరించారు. ఆయన పడుచుప్రాయంలో ఉన్నవారు. పొడుగ్గా, సన్నగా, ఆలోచనాపరులుగా కనిపించే ఆ స్వామివారి మీద నాకు సదభిప్రాయం కలిగింది. అందమైన ఆయన ముఖంలో, బుద్ధుడిలో ఉన్న మాదిరి ప్రశాంతత ఉండేది.

ఈ కొత్త నివాసంలో ఒక అటక ఉన్నందుకు నేను సంతోషించాను. ఉదయ సంధ్య వేళా పొద్దుటి పూటా అక్కడ గడపడానికి వీలు కల్పించుకున్నాను. ధ్యాన సాధన గురించి ఏమీ తెలియని ఆ ఆశ్రమవాసులు, నాకున్న సమయమంతా ఆశ్రమ నిర్వహణ విధులు నిర్వర్తించడానికే వినియోగించాలని అనుకునేవారు. మధ్యాహ్నంపూట నేను వాళ్ళ ఆఫీసులో చేసే పనికి మెచ్చుకునేవారు.

“దేవుణ్ణి అంత తొందరగా పట్టుకోడానికి ప్రయత్నించకు!” ఒకనాడు పొద్దున నేను అటకమీదికి వెళ్తూ ఉండగా నా వెంట వచ్చిన