పుట:Oka-Yogi-Atmakatha.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గురుదేవులు శ్రీయుక్తేశ్వర్‌గారిని కలుసుకోడం

151

నా కొత్త ఘనత కారణంగా ఇప్పుడు, ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి బాహాటంగానే పథకం వేస్తున్నాను. జితేంద్ర మజుందార్[1] అనే స్నేహితుడితో కలిసి వెళ్ళి, కాశీలో ఉన్న శ్రీ భారత్ ధర్మ మహామండల్ వాళ్ళ ఆశ్రమంలో చేరి, ఆధ్మాత్మికమైన శిక్షణ పొందాలని నిశ్చయించుకున్నాను.

మా కుటుంబంతో ఎడబాటు వస్తుందన్న ఆలోచనతో ఒకనాడు నేను బెంగపడిపోయాను. అమ్మ పోయినతరవాత ఇంట్లోవాళ్ళమీద, ముఖ్యంగా మా తమ్ముళ్ళు- సనందుడి మీదా విష్ణు మీదా- మా చివరి చెల్లెలు తామూ మీదా నా ఆప్యాయత గాఢంగా పెరిగింది. వెంటనే నా ఏకాంత స్థలానికి పరిగెత్తాను. ఒడుదుడుకులతో కూడిన నా ఆధ్యాత్మిక సాధన[2]లోని అనేక దృశ్యాలకు ఆ అటకే ప్రత్యక్ష సాక్షి. రెండు గంటల సేపు నా కన్నీరు వరదలై పారిన తరవాత, అన్నిటినీ క్షాళనం చేసే ఒకానొక అజ్ఞాతశక్తి వల్ల నాలో ఒక విలక్షణమైన పరివర్తన వచ్చినట్టు అనిపించింది. అనుబంధాలన్నీ[3] అదృశ్యమయిపోయాయి; స్నేహితులందరినీ మించిన స్నేహితుడైన భగవంతుణ్ణి అన్వేషించాలన్న నిర్ణయం బాగా బలపడింది.

  1. సమయం వచ్చేసరికి పులులమీద రోత పుట్టిన జతీన్‌దా (జోతీన్ ఘోష్) కా డితను.
  2. దేవుణ్ణి చేరే దారి, ప్రాథమికమైన మార్గం.
  3. ప్రేమించే బంధువులతోబాటు మనకు వరాలన్నీ ప్రసాదించే– ఆ మాటకు వస్తే, ఈ జీవితాన్నే ప్రసాదించిన- దేవుణ్ణి అన్వేషించడానికి భక్తుడికి, సంసారబంధం అవరోధం కలిగించేటట్లయితే, అటువంటి అనుబంధం ‘మాయ’ అని హిందువుల పవిత్ర గ్రంథాలు ఉద్బోధిస్తున్నాయి. ఏసుక్రీస్తు కూడా అలాగే చెప్పాడు; “నాకంటె తన తల్లినిగాని తండ్రినిగాని ఎక్కువగా ప్రేమించేవాడు నావాడు కావడానికి అర్హుడు కాడు.” - మత్తయి 10 : 37 (బైబిలు).