పుట:Oka-Yogi-Atmakatha.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

150

ఒక యోగి ఆత్మకథ

“అసాధారణమైన ఈ శ్లోకాలు నీ సంస్కృత పరీక్షకి పనికొచ్చే అవకాశం లేదు. ఆ పండితుడు, అపనమ్మకంగా అన్నాడు.

అయితే, ఆ కవిత్వంతో ఏర్పడ్డ పరిచయమే, ఆ మర్నాడు జరిగే సంస్కృత పరీక్షలో నేను ప్యాసవడానికి సాయపడింది. వివేచనాత్మకంగా నంటూ చేసిన సహాయంవల్ల నేను తక్కిన పాఠ్యవిషయాల్లో కూడా అత్తెసరు మార్కులు తెచ్చుకుని పరీక్ష గట్టెక్కాను.

ఇచ్చినమాట నిలబెట్టుకుని నేను సెకండరీ స్కూల్ కోర్సు పూర్తి చేసినందుకు నాన్న గారు సంతోషించారు. నంటూ ఇంటికి వెళ్ళడం విషయంలోనూ, చెత్తకుప్ప పక్కనుంచి అలవాటు లేని దారిలో నడిచివెళ్ళడం విషయంలోనూ నా కొక దారి చూపించినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకొన్నాను. నన్ను ఆదుకోడానికి సమయోచితంగా తాను వేసిన పథకాన్ని ఆయన సరదాగా రెండు రకాలుగా వ్యక్తంచేశాడు.

పరీక్ష హాళ్ళలో దేవుడి ప్రాముఖ్యాన్ని నిరసించిన రచయితగారి పుస్తకం- వెనక నేను చదవకుండా విడిచిపెట్టేసినది-- మళ్ళీ నా కంట బడింది. నిశ్శబ్దంగా నాలో నేను చేసుకున్న వ్యాఖ్యానానికి ముసిముసి నవ్వు ఆపుకోలేకపోయాను:

“పీనుగుల మధ్య కూర్చుని దైవప్రార్థన చెయ్యడం, హైస్కూలు డిప్లమా సంపాయించడానికి అడ్డదారి అని కనక నే నీయనకి చెప్పవలసి వస్తే, ఈయనగారి మనస్సులో గందరగోళం ఇంకా పెరిగిపోయేది!”