పుట:Oka-Yogi-Atmakatha.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గురుదేవులు శ్రీయుక్తేశ్వర్‌గారిని కలుసుకోడం

149

ఈ మామూలు మాటలే ఒక దివ్యమైన వాగ్దానాన్ని నా చెవుల్లో వేశాయి; మంచి హుషారుగా మా స్నేహితుడి ఇంటికి వెళ్ళాను. మాస్టర్లు పరీక్షలో ఇవ్వవచ్చునని తన కనిపించిన రకరకాల ప్రశ్నలకు సమాధానాలు, వాడు నాకు స్థూలంగా చెప్పుకొచ్చాడు.

“ఈ ప్రశ్నలు, ఆత్మవిశ్వాసంతో పరీక్షకి వెళ్ళే కురాళ్ళని చాలామందిని, పరీక్షల్లో బోల్తాకొట్టిస్తాయి. నా సమాధానాలు గుర్తుంచుకో; దెబ్బతినకుండా బయటపడతావు నువ్వు.”

నేను అక్కణ్ణించి బయల్దేరేసరికి రాత్రి చాలా గడిచిపోయింది. అప్పటికప్పుడు పట్టించుకున్న పాండిత్యంతో పిటపిటలాడిపోతూ, రాబోయే గడ్డు రోజుల్లో ఆ పాండిత్యం అలాగే నిలిచి ఉండాలని భక్తితో ప్రార్థన చేశాను. నంటూ, నా పరీక్షకున్న అనేక పాఠ్యవిషయాలు నాకు బోధించాడు; కాని ఆ తొందరలో, టైము చాలకపోవడం వల్ల, నా సంస్కృతం కోర్సు సంగతి మరిచిపోయాడు. ఈ పొరపాటును దేవుడికి భక్తిపూర్వకంగా గుర్తుచేశాను.

మర్నాడు పొద్దున, లయబద్ధంగా కదంతొక్కుతూ నడుస్తూ, కొత్తగా గడించిన జ్ఞానాన్ని ఒంటబట్టించుకుంటూ షికారుకు బయల్దేరాను. నేను అడ్డదారి పట్టి, ఒక మూల ఒత్తుగా పెరిగిన గడ్డిమొక్కల్లో పడి పోతూ ఉండగా విడివిడిగా పడిఉన్న కొన్ని అచ్చుకాయితాల మీద నా కళ్ళు పడ్డాయి. విజేతలా గబుక్కున ముందుకు దూకాను; సంస్కృత శ్లోకాలు నా చేతికి చిక్కాయి! వాటికి విడమరిచి అర్థాలు చెప్పించుకోడానికి ఒక పండితుణ్ణి వెతికిపట్టుకున్నాను. ఆయన గంభీరస్వరం, ఆ ప్రాచీన భాషకున్న అపరిమిత మాధుర్యంతో గాలిని నింపేసింది.[1]

  1. “సంస్కృత” మంటే, “మెరుగు దిద్దినది, సంపూర్ణమైనది” అని అర్థం. ఇండో యూరోపియన్ భాషలన్నిటికి సంస్కృతం పెద్దక్క. దీని అక్షర లిపిని “దేవనాగరి” అంటారు; అంటే “దేవతానిలయం” అని వాచ్యార్థం. ప్రాచీన భారతదేశపు భాషాశాస్త్రవేత్త పాణిని, గణితశాస్త్రీయంగానూ మనోవైజ్ఞానికంగానూ సంస్కృతానికున్న పరిపూర్ణతను ప్రశంసిస్తూ, “నా వ్యాకరణం తెలిసినవాడు దేవుణ్ణి తెలుసుకుంటాడు,” అన్నాడు. నిజానికి, భాషోత్పత్తిక్రమానికి మూలం కనుక్కొనేవాడు చివరికి సర్వజ్ఞుడవుతాడు.