పుట:Oka-Yogi-Atmakatha.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

148

ఒక యోగి ఆత్మకథ

ఈ విధంగా నేను చేసే అర్ధరాత్రి జాగరణలు స్వభావరీత్యా, విద్యార్థులు చేసే జాగరణలకు భిన్నమైనవి.

హిందూ హైస్కూల్లో సంవత్సరాంత పరీక్షలు జరిగేవారం గబగబా దగ్గరపడుతోంది. ఈ పరీక్షాకాలం, శ్మశానవాటికలాగే సుపరిచితమైన భయోత్పాతాన్ని కలిగిస్తుంది. అయినా నా మనస్సు ప్రశాంతంగానే ఉంది. పిశాచాలకు జంకకుండా నేనక్కడ, తరగతి గదుల్లో కంటబడని జ్ఞానాన్ని తవ్వి తీస్తున్నాను. కాని నాకు, ప్రణవానందస్వామివారిలా, ఒకే సమయంలో రెండుచోట్ల సులువుగా కనబడే నేర్పు లేదు. అయితే భగవంతుడు ఆ సంకటస్థితిని గమనించి నన్ను దాంట్లోంచి బయటపడేస్తా డన్నది నా ఆలోచన (దురదృష్టవశాత్తు, కొందరికిది తర్కవిరుద్ధంగా కనిపించవచ్చు). కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడి లీలావిశేషం, వివరించడానికి వీలుకాని విధంగా, వెయ్యి దృష్టాంతాల్లో కళ్ళకు కట్టినప్పుడు వాటిమూలంగా భక్తుడికి హేతురాహిత్యం ఏర్పడుతుంది.

“ఓ ముకుందా! ఈమధ్య బొత్తిగా కనిపించడమే మానేశావు!” ఒకనాడు మధ్యాహ్నం నా సహాధ్యాయి ఒకడు నన్ను గుర్పార్ రోడులో పలకరించాడు.

“అరే, నంటూ! నేను స్కూల్లో కనిపించకపోవడం నన్ను తప్పకుండా ఇరకాటంలో పెట్టేలా ఉందిరా,” అంటూ, స్నేహపూర్వకంగా చూస్తున్న నంటూ దగ్గర నా బాధ వెళ్ళబెట్టుకున్నాను.

నంటూ మంచి తెలివైన విద్యార్థి. వాడు నా మాటకి కులాసాగా నవ్వాడు. నా అవస్థ చూస్తే ఎవరికయినా నవ్వు రాకపోదు.

“చివరి పరీక్షలకి నువ్వు బొత్తిగా తయారుకాకుండా ఉన్నావు!” అన్నాడు వాడు. “నేను నీకు సహాయం చెయ్యాలనుకుంటాను!”