పుట:Oka-Yogi-Atmakatha.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అధ్యాయం : 10

గురుదేవులు శ్రీయుక్తేశ్వర్ గారిని

కలుసుకోడం

“దేవుడి మీది ప్రగాఢ విశ్వాసం ఏ అలౌకిక ఘటన నయినా జరిపించ గలదు - చదవకుండా పరీక్ష ప్యాసవడం ఒక్కటి తప్ప.” ఏమీ తోచనప్పుడు ఒకసారి నేను తీసుకొన్న “స్ఫూర్తిదాయకమైన” పుస్తకాన్ని వెంటనే వెగటుపుట్టి మూసేశాను.

“రచయిత చెప్పిన మినహాయింపు చూస్తే, దేవుడిమీద ఆయనగారికి బొత్తిగా విశ్వాసం లేనట్టు కనిపిస్తోంది,” అనుకున్నాను. “పాపం వెర్రివాడు; నడిరాత్రి వెలిగే దీపం చమురు మీదే గొప్ప గౌరవమున్నవాడు!”

నేను హైస్కూలు చదువు పూర్తిచేస్తానని, వెనకే మా నాన్నగారికి మాట ఇచ్చాను. కాని నేను శ్రద్ధపట్టినట్టు నటించలేను. నెలలు గడుస్తున్నకొద్దీ నేను క్లాసులో కనిపించడం మరింత తక్కువయింది; కలకత్తా స్నానాల రేవుల్లో నిర్జన ప్రదేశాలకు వెళ్ళడం ఎక్కువయింది. ఆ రేవుల్నే ఆనుకొని ఉన్నాయి శ్మశానాలు. ముఖ్యంగా రాత్రిపూట భయంకరంగా ఉండే ఈ శ్మశానాలు యోగిని బాగా ఆకట్టుకుంటాయని అంటారు. మరణం లేని మహత్తత్త్వాన్ని అన్వేషించేవాడు. కొన్ని బోడిపుర్రెల్ని చూసి బెదిరిపోగూడదు. రకరకాల ఎముకలు చెల్లాచెదరుగా ఉండే నైరాశ్య నిలయంలోనే, మానవజీవితం ఎంత అపరిపూర్ణమయినదో స్పష్టమవుతుంది.