పుట:Oka-Yogi-Atmakatha.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆనందభరిత భక్తుడు, ఆయన విశ్వప్రేమలీల

141

“అయ్యా, మీరిక్కడున్నారేమిటి?”

ఆ సాధువు నా ప్రశ్న పట్టించుకోకుండా, నా ఆలోచనకు జవాబిచ్చారు. “చిన్న బాబూ, భగవన్నామం, అజ్ఞానుల నోట్లోంచి వచ్చినా జ్ఞానుల నోట్లోంచి వచ్చినా మధురంగానే ఉంటుంది కదూ?” అంటూ ఆప్యాయంగా నన్ను దగ్గరికి తీసుకున్నారు. ఆయన ‘మాయ తివాసీ’ మీద నన్ను కరుణామయి సన్నిధికి తీసుకువెళ్ళిపోయారని గ్రహించాను.

“నువ్వు కొన్ని బై స్కోపులు చూస్తావా?” ఒకనాడు మధ్యాహ్నం, విరాగులైన మాస్టర్ మహాశయుల నోట్లోంచి ఈ ప్రశ్న రావడం నాకు అగమ్యంగా అనిపించింది; బై స్కోపు అన్న మాట భారతదేశంలో ఆ రోజుల్లో, సినిమాలకు వాడేవారు. నేను సరే నన్నాను; ఆయన వెంబడి ఉంటే చాలు, ఏ పరిస్థితుల్లో ఉన్నా నాకు సంతోషమే. వడివడిగా నడిచి, కలకత్తా విశ్వవిద్యాలయం ముందరి తోట దగ్గరికి వచ్చాం. ‘గోల్‌డిఘీ’ అనే నీళ్ళకుంట దగ్గరున్న బల్ల చూపించారాయన.

“కొన్ని నిమిషాలు ఇక్కడ కూర్చుందాం. ఎక్కడయినా విశాల జలాశయం కనిపిస్తే ధ్యానంచెయ్యమని. మా గురువుగారు చెప్పారు. ఇక్కడ దీనికున్న ప్రశాంతత, దేవుడి అపార శాంతిని మనకు జ్ఞాపకం చేస్తుంది. సమస్త వస్తు జాలమూ ఈ నీళ్ళలో ప్రతిఫలించినట్టుగానే, ఈ విశ్వమంతా విశ్వమానస సరోవరంలో ప్రతిబింబిస్తూ ఉంటుంది. అలాగని మా గురుదేవులు తరచు అంటూండేవారు.”

కాసేపట్లో మేము యూనివర్సిటీ హాలులోకి ప్రవేశించాం; అక్కడ ఒక ఉపన్యాసం జరుగుతోంది. అప్పుడప్పుడు లాంతరు స్లైడ్లువేసి చూపిస్తున్నప్పటికీ, ఆ ఉపన్యాసం చాలా నిరుత్సాహజనకంగా ఉంది; చూపించే స్లైడ్లు కూడా అంత నిరుత్సాహకరంగానూ ఉన్నాయి.