పుట:Oka-Yogi-Atmakatha.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

140

ఒక యోగి ఆత్మకథ

ఒకనాడు సాయంత్రం ఆయనా నేనూ చెయ్యీ చెయ్యీ కలుపుకొని ఆయన విద్యాలయ ఆవరణలో తిరుగుతున్నాం. ఇంతలో అక్కడికి, ఆయన పరిచయస్థుడొకడు వచ్చాడు. అతడు వట్టి ధూర్తుడు; అతని రాకతో నా ఆనందం సన్న గిలింది. అతను చాలాసేపు ఏవేవో మాట్లాడుతూ మమ్మల్ని ఊదరగొట్టేశాడు.

“ఇతను నీకు సంతోషం కలిగించడం లేదని గ్రహించాను” అంటూ నాతో రహస్యంగా అన్నారాయన. ఆ వచ్చిన దురహంకారి తన సోదికి తానే ముగ్ధుడై ఉన్నందువల్ల ఈ మాటలు అతని చెవిని పడలేదు. “దీన్ని గురించి జగన్మాతకు చెప్పాను; మన దుస్థితి ఆమెకు తెలుసు. అదుగో, అక్కడున్న ఎర్రరంగు ఇంటి దగ్గరికి మనం వెళ్ళేసరికి, అతనికి బాగా తొందరపని ఒకటి జ్ఞాపకం చేస్తానని ఆవిడ మాట ఇచ్చింది.” అన్నారు.

మాకు విముక్తి ప్రసాదించే చోటుమీదే నిలిచిపోయాయి నా కళ్ళు. అతను సరిగా ఎర్రగేటు దగ్గరికి వచ్చినవాడల్లా, కారణమేమీ లేకుండానే తిరిగి వెళ్ళిపోయాడు. చెప్పే వాక్యం పూర్తి చెయ్యనూ లేదు, వెళ్ళొస్తానని మాతో చెప్పనూ లేదు. కల్లోలిత వాతావరణంలో మళ్ళీ శాంతి నెలకొంది.

మరో రోజున నేను హౌరా రైల్వే స్టేషను దగ్గర ఒంటరిగా నడుస్తున్నాను. ఒక గుడి దగ్గర, తప్పెట్లూ తాళాలూ కొడుతూ గొంతు చించుకొంటూ భజన చేస్తున్న ఒక చిన్న బృందాన్ని చూసి నేను మనస్సులో విమర్శించుకొంటూ క్షణకాలం నిలిచిపోయాను.

“దేవుడి పవిత్ర నామాన్ని వీళ్ళు ఎంత భక్తి శూన్యంగా, యంత్రం మాదిరిగా పునశ్చరణ చేస్తున్నారు!” అనుకున్నాను. ఇంతలో హఠాత్తుగా, మాస్టర్ మహాశయులు నా వేపు గబగబా వస్తూండడం చూసి ఆశ్చర్యపోయాను.