పుట:Oka-Yogi-Atmakatha.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆనందభరిత భక్తుడు, ఆయన విశ్వప్రేమలీల

139

జంగా కారే పాలు, మాస్టర్ మహాశయులు అందిస్తున్న అమృతధారకు ప్రతీకగా ఉన్నాయి. ఆయన దైవప్రార్థనలు కొనసాగుతూనే ఉన్నాయి. గులాబివన్నె రేక లుండే ఝావుక పుష్పాలమధ్య నేను, గడ్డినేలమీద అత్యంత నిశ్చలంగా కూర్చున్నాను. తాత్కాలికంగా ఈ శరీరంలోంచి బయల్పడి దివ్యలోకాల్లో విహరించాను.

దక్షిణేశ్వరం సందర్శించడానికి మాస్టర్ మహాశయులతో కలిసి నేను చేసిన యాత్రల్లో ఇది మొదటిది. మాతృభావంలో, లేదా దివ్య కరుణామయిభావంలో భగవంతుడి మాధుర్యాన్ని ఆయన దగ్గరే నేను చవిచూశాను. ఆ సాధువు శిశుహృదయానికి పితృభావం, లేదా దివ్యన్యాయభావం రుచించదు. కఠినమూ అమిత ప్రయాసాత్మకమూ గణితబద్ధమూ అయిన తీర్పరితనం ఈయన సాధుస్వభావానికి సరిపడేది కాదు.

ఒకనాడు ప్రార్థనల్లో నిమగ్నులై ఉన్న ఆయన్ని ప్రేమతో గమనిస్తున్నప్పుడు, “స్వర్గంలో ఉండే దేవదూతలకు ఈయన, భూమిమీద ప్రతిరూపం,” అనిపించింది. ఆక్షేపణకాని, విమర్శకాని స్పర్శామాత్రంగా కూడా సోకకుండా ఈయన, ఆద్యస్వచ్ఛతతో చిరకాలంగా పరిచయమైన కళ్ళతో ప్రపంచాన్నంతనీ పరిశీలించేవారు. ఈయన శరీరం, మనస్సు, వాక్కు, చేతులు ఆన్నీ ఆత్మసారళ్యంలో అప్రయత్నంగా సామరస్యం పొందాయి.

ఈయన మామూలుగా, ఎవరికయినా సలహా ఇచ్చేటప్పుడు, తమ వ్యక్తిత్వానికి ప్రాధాన్యమియ్యకుండా, “మా గురుదేవులు నా కిలా చెప్పారు,” అని చెప్పి జోహార్లు అర్పిస్తూ ముగించేవారు. మాస్టర్ మహాశయులకు శ్రీరామకృష్ణులతో తాదాత్మ్యం ఎంత ప్రగాఢంగా ఉండేదంటే, ఆయన తమ ఆలోచనల్ని వేటినీ తమ సొంతంగా గణించేవారే కాదు.