పుట:Oka-Yogi-Atmakatha.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

136

ఒక యోగి ఆత్మకథ

మరుగుపరిచి, కేవలం సరదాకోసం నా ముఖంలో గాంభీర్యం తెచ్చి పెట్టుకున్నాను.

“వచ్చేశానండీ- చాలా పెందరాళే వచ్చానని ఒప్పుకుంటాను. మీ సందేశం కోసం! జగన్మాత నా గురించి ఏమయినా చెప్పిందాండీ?”

“కొంటె చిన్నబాబూ!”

మరోమాట అననేలేదాయన. నేను తెచ్చిపెట్టుకున్న గాంభీర్యం ఆయనకి నమ్మకం కలిగించినట్టు లేదు.

“అంత గుట్టు ఎందుకండి? అలా మాట తప్పిస్తున్నారేం? సాధువు లెప్పుడూ సూటిగా చెప్పరా?” బహుశా నేను కొంచెం రెచ్చిపోయి మాట్లాడా ననుకుంటాను.

“నువ్వు నన్ను పరీక్షించక తప్పదా!” ప్రశాంతమైన ఆయన కళ్ళలో అవగాహన నిండుగా ఉంది. “నిన్న రాత్రి పది గంటలకు సౌందర్యమయి అయిన జగన్మాత స్వయంగా నీ కిచ్చిన హామీకి అదనంగా ఈరోజు పొద్దున నేను ఒక్క ముక్కయినా చేర్చవలసిన అవసరముందా?”

నా అంతరాత్మ వరద వెల్లువను అరికట్టి ఉంచే ద్వారాలు మాస్టర్ మహాశయుల అధీనంలో ఉన్నాయి. మళ్ళీ నేను ఆయన పాదాలముందు మోకరిల్లాను. ఈసారి నా కన్నీళ్ళు ఆనందంవల్ల పెల్లుబికినవే. కాని, వెనకటిలా బాధవల్ల వెలువడ్డవి కావు.

“భక్తితో నువ్వు పిలిచిన పిలుపు, ఆ ఆపార దయామయికి అందలేదనుకున్నావా? ఎడబాటు సహించలేక నువ్వు వేసిన కేకకు, మానవ రూపంలోనూ దేవతారూపంలోనూ కూడా నువ్వు ఆరాధించిన, దేవుడి మాతృభావం మారు పలకకుండా ఉండదు.”