పుట:Oka-Yogi-Atmakatha.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

126

ఒక యోగి ఆత్మకథ

లోహాల్లో జీవశక్తి, బయటినుంచి కలిగే ప్రేరణలను బట్టి అనుకూలంగా గాని ప్రతికూలంగా గాని ప్రతిక్రియలు చూపిస్తుంది. సిరా గుర్తులు వివిధ ప్రతిచర్యల్ని నమోదు చేస్తాయి చూడు.”

అణుఘటనం తాలూకు స్వాభావిక తరంగాల్ని నమోదుచేసిన గ్రాఫును తదేకదృష్టితో తిలకించాను. ఆ ప్రొఫెసరుగారు తగరానికి మత్తు మందు ఇచ్చినప్పుడు స్పందనాత్మక లేఖనాలు ఆగిపోయాయి. ఆ లోహం మళ్ళీ మెల్లగా మామూలు స్థితికి వస్తుంటే అవి పునఃప్రారంభమయాయి. ఆయన విషసంబంధమైన ఒక రసాయనాన్ని దానికి పూశారు. ఒక పక్క తగరం ముక్క కొన విలవిల్లాడుతూ ఉండగా, పట్టిక మీదున్న ముల్లు చావుకబురు చల్లగా చెప్పింది. శాస్త్రవేత్త ఇలా అన్నారు:

“కత్తెరలు, యంత్రాలు వంటివాటికి ఉపయోగించే ఉక్కులాంటి లోహాలు అలసటకు గురి అవుతాయనీ, నియతకాలికమైన విశ్రాంతి కనక పొందితే వాటి సామర్థ్యం మళ్ళీ పెరుగుతుందనీ బోస్ పరికరాలు నిరూపించాయి. విద్యుత్ ప్రవాహాలుకాని, భారీ ఒత్తిడికాని కలిగించడం వల్ల లోహాల్లోని జీవనాడికి తీవ్రంగా హాని కలగడమే కాకుండా అది పూర్తిగా అంతరించిపోతుంది.”

అలుపులేని బుద్ధికుశలతకు ప్రశంసనీయమైన ప్రమాణంగా గదిలో నాలుగు పక్కగా అమర్చి ఉన్న ఎన్నో రకాల పరికరాలను నేను చూశాను.

“అయ్యా, అద్భుతమైన మీ యంత్రసామగ్రిని పూర్తిగా వినియోగించుకొని భారీ వ్యవసాయాన్ని త్వరత్వరగా అభివృద్ధిచెయ్యక పోవడం విచారకరమైన విషయం. మొక్కల పెరుగుదలకు దోహదంచేసే రకరకాల రసాయనిక ఎరువుల ప్రభావాన్ని చూపించడానికి, వాటిలో కొన్నిటి