పుట:Oka-Yogi-Atmakatha.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

124

ఒక యోగి ఆత్మకథ

తిరిగాయి. కాలాన్నీ చారిత్రకుల్నీ కూడా సమానంగా కలవరపెట్టే ఈ “ఓర్పు” భారతదేశానికి మారుపేరు కాదా?

పరిశోధన కేంద్రం ప్రారంభోత్సవం జరిగిననాటి తరవాత, త్వరలోనే మళ్ళీ వెళ్ళాను నేను. ఆ మహాశాస్త్రవేత్త, తామిచ్చిన మాట గుర్తుంచుకొని నన్ను, ప్రశాంతమైన తమ ప్రయోగశాలకు తీసుకువెళ్ళారు.

“ఈ ఫెర్న్ మొక్కకు క్రెస్కోగ్రాఫు తగిలిస్తాను; దీని వర్ధక శక్తి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇదే అనుపాతంలో నత్తనడకను కనక పెంచి చూస్తే, ఆ పురుగు ఎక్స్‌ప్రెస్ బండిలా ప్రయాణం చేస్తున్నట్టు కనిపిస్తుంది.”

పెద్దగా కనిపించేటట్టు పెంచిన, ఫెర్న్ మొక్క నీడ పడుతున్న తెరమీద చూపు నిలిపి ఉంచాను. సూక్ష్మమైన జీవన చలనాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సమ్మోహితమైన నా కళ్ళముందే ఆ మొక్క, మెల్ల మెల్లగా పెరుగుతోంది. బోసు మహాశయులు, ఒక చిన్న లోహపు కడ్డీతో ఆ ఫెర్న్ మొక్క కొనను తాకారు, తాకీ తాకడంతోనే, మూకాభినయంలా సాగుతున్న పెరుగుదల చటుక్కున ఆగిపోయింది; కడ్డీ తీసెయ్యగానే, లయబద్ధంగా సాగే పెరుగుదల మళ్ళీ కొనసాగింది.

“బయటి నుంచి ఏ కొద్దిపాటి జోక్యం కలిగినా సరే, సున్నితమైన కణజాలాలకి అది ఎంత హానికరమవుతుందో చూశావు,” అన్నారు బోసు మహాశయులు. “ఇదుగో, నే నిప్పుడు మత్తుమందు ఇస్తాను చూడు; ఆ తరవాత దానికి విరుగుడు ఇస్తాను.”

మత్తుమందు ఫలితంగా పెరుగుదల అంతా ఆగిపోయింది; విరుగుడు ఇచ్చేసరికి మళ్ళీ మొదలయింది. తెరమీద కనిపిస్తున్న పరిణామాత్మక భంగిమలు “చలన చిత్ర” కథ కంటె కూడా ఎక్కువగా నన్ను