పుట:Oka-Yogi-Atmakatha.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త, సర్ జగదీశ్‌చంద్ర బోసు

121

ఉండనే ఉండదు. కష్టించి పనిచేసి జయం పొందినవాడే విజయవంతమైన తన అనుభవ ఫలాల్ని ప్రపంచానికి అందించి దాన్ని సుసంపన్నం చెయ్యగలడు.

“జడపదార్థం చూపించే ప్రతిచర్య గురించి, మొక్కల జీవితంలో వెల్లడి అయిన అనుకోని విషయాలగురించి బోస్ ప్రయోగశాలలో ఇప్పటికే జరిగిన కృషి, భౌతికశాస్త్రంలోనూ జంతుశరీరధర్మశాస్త్రంలోనూ వ్యవసాయశాస్త్రంలోనూ చివరికి మనోవిజ్ఞానశాస్త్రంలో సైతం, ఎంతో విస్తృతమైన పరిశోధన రంగాల్ని ఆవిష్కరించింది. ఇంతవరకు పరిష్కరించడానికి వీలుకావనుకున్న సమస్యలన్నిటినీ ఇప్పుడు ప్రయోగాత్మక పరీక్షాపరిధిలోకి తీసుకురావడం జరిగింది.

“అయితే ఘనవిజయమన్నది కఠోరమైన సునిశితత్వం సాధించనిదే చేకూరదు. అందుచేతనే నేను రూపొందించిన అత్యధిక సూక్ష్మగ్రాహక యంత్రాలూ పరికరాలూ ఒక వరసలో పొడుగ్గా, ఈనాడు మందిర ప్రవేశ విభాగంలో మీ ముందు నిలిచి ఉన్నాయి. భ్రాంతి కలిగించే ఆభాసకు వెనక అగోచరంగా ఉండే వాస్తవాన్ని తెలుసుకోడానికి కావలసిన సుదీర్ఘ ప్రయత్నాల్ని గురించి, మానవ పరిమితుల్ని అధిగమించడానికి అవసరమైన అనవరత పరిశ్రమ, పట్టుదల, ప్రతిభలనుగురించి తెలుపుతాయవి. భ్రాంతులకు వెనక ఉండే సత్యసూత్రాల్ని బయల్పరచగల నిజమైన ప్రయోగశాల మనస్సు అన్న సంగతి, సృజనాత్మక శాస్త్రవేత్తలందరికీ తెలుసు.

“ఇక్కడ ఇచ్చే ఉపన్యాసాలు కేవలం, ఇతరులు కనిపెట్టి చెప్పిన వాటిని చిలకపలుకుల్లా అప్పగించేటట్టు ఉండవు. ఈ ప్రయోగశాలలో మొట్ట మొదటిసారిగా కనుక్కొని, కళ్ళకు కట్టించే కొత్త ఆవిష్కరణల్ని ప్రకటిస్తాయవి. ఈ సంస్థ పక్షాన అప్పుడప్పుడు నియతకాలికంగా వెలువడే ప్రచురణల ద్వారా, భారతీయుల కృషి ప్రపంచానికంతకీ అందు