పుట:Oka-Yogi-Atmakatha.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త, సర్ జగదీశ్‌చంద్ర బోసు

117

నప్పటికీ అది జీవశాస్త్రాభివృద్ధికి గొప్పగా తోడ్పడింది. ఈ క్రెస్కోగ్రాపు లెక్కలేనన్ని మార్గాల్ని ఆవిష్కరిస్తుంది.”

“మహాశయా, నిరాకారమైన శాస్త్రహస్తాలతో పడమటి దేశాలు తూర్పుదేశాల్ని త్వరగా దగ్గరికి చేర్చుకోడానికి మీ రెంతో దోహదం చేశారు,” అన్నాను.

“నేను కేంబ్రిడ్జిలో చదువుకున్నాను. సిద్ధాంతాన్నంతనీ సునిశితమైన ప్రయోగాత్మక పునఃపరిశీలనకు గురిచేసే పాశ్చాత్య పద్ధతి ఎంతో హర్షించదగ్గది! తూర్పుదేశాల వారసత్వంగా నాకు సంక్రమించిన అంతఃపరిశీలనాశక్తికి, ఈ అనుభవిక ప్రక్రియ తోడయింది. ఆ రెండూ కలిసి చాలాకాలంగా మూగవోయి ఉన్న ప్రాకృతిక రాజ్యాల మౌనాల్ని తొలగించడానికి నాకు తోడ్పడ్డాయి. మొక్కలకు సున్నితమైన నాడీమండలం ఉందని, అవి భిన్నమైన భావోద్రేకాలకు గురి అవుతూ ఉంటాయని నా క్రెస్కోగ్రాఫ్[1] తాలూకు వివరణ పట్టికలు, ఎంతో సంశయశీలుడైన వ్యక్తికి కూడా, నిరూపించి చూపిస్తాయి. ప్రేమ, ద్వేషం, ఆనందం, భయం, సంతోషం, బాధ, ఉద్రిక్తత, మైకం, లెక్కలేనన్ని ఇతర ఉత్తేజకాలూ జంతువులన్నిటికీ ఎంత సర్వసామాన్యమైనవో, మొక్కలకు కూడా అంత సర్వసామాన్యమైనవి.”

“ప్రొఫెసరుగారూ! మీరు రంగంలోకి ప్రవేశించకముందు, సృష్టి అంతా ప్రాణంతో స్పందించడమన్నది కేవలం కవుల కల్పన అనిపించేది. వెనక, నాకు తెలిసిన సాధువు ఒకాయన, ఎన్నడూ పువ్వులు కోసేవారు కారు. ‘గులాబి పొదకున్న సౌందర్య గర్వాన్ని నేను హరించనా? మొర

  1. crescere అనే లాటిన్ ధాతువునుంచి వచ్చింది : ‘పెంపొందించడం’ అని దీనికి అర్థం. ఈ క్రెస్కోగ్రాఫు ఇతర పరికరాలూ కనిపెట్టినందుకు బోసును 1917 లో ‘నైట్’ను చేశారు.