పుట:Oka-Yogi-Atmakatha.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాలిలో తేలే సాధువు

113

చేసుకొన్న మీదట వెలువడినవి. “ఈ ప్రపంచం, బయట భద్రత ఉండి లోపల అశాంతి అలుముకొన్న విశ్వాసపరులతో నిండి ఉంది. కటువుగా ఉండే వాళ్ళ ఆలోచనలు వాళ్ళ నుదుటి మీద మచ్చల్లాటివి. తొలిసారిగా ఊపిరి ఆడినప్పటినుంచి మనకు గాలీ పాలూ కల్పించినవాడికి, తన భక్తులకు ఏ రోజుకు కావలసినవి ఆ రోజు అమర్చి పెట్టడం ఎల్లాగో తెలుసు.”

బడి విడిచిపెట్టిన తరవాత ఆ సాధువుగారి దర్శనానికి వెళ్ళడం కొనసాగిస్తూనే వచ్చాను. నేను ‘అనుభవం’ పొందడానికి ఆయన, పైకి చడీ చప్పుడు లేని ఉత్సాహంతో తోడ్పడ్డారు. ఒకనాడు ఆయన రామ మోహన్ రాయ్ రోడ్డుకు మకాం మార్చేశారు. అది మా గుర్పార్ రోడ్డు ఇంటి పరిసరాలకి చాలా దూరం. ఆయన మీద అభిమానం గల శిష్యులొకరు, ‘నగేంద్ర మఠం’[1] అన్న పేరుతో ఆయనకోసం ఒక ఆశ్రమం కట్టించారు.

  1. ఆయన పూర్తిపేరు నగేంద్రనాథ్ భాదురీ. మఠమంటే సన్యాసులుండే ఆశ్రమం. క్రైస్తవ ప్రపంచంలోని, “గాలిలో తేలే యోగు”ల్లో, 17వశతాబ్ది నాటి కూపర్టినోలోని సెంట్ జోసఫ్ ఒకడు. ఆయన చేసిన యోగక్రియను కళ్ళారా చూసి చెప్పినవాళ్ళు దండిగా ఉన్నారు. సెంట్ జోసఫ్ మతిమరుపుమనిషిలా పైకి కనిపించేవాడు: కాని ఆ మతిమరుపు నిజానికి దివ్యస్మరణ. తోటి ఆశ్రమవాసులు ఆయన్ని అందరితోబాటు కలిసి ఒకే బల్లదగ్గర భోజనానికి కూర్చోనిచ్చేవారు కాదు; పింగాణీ పళ్ళాలతో సహా ఆయన గాలిలో పైకప్పుదాకా తేలిపోతాడని. ఈ సాధువు, ఎక్కువసేపు ఎప్పుడూ భూమిమీద ఉండలేకపోవడంవల్ల ప్రాపంచిక విధులు నిర్వర్తించడానికి అనర్హుడయిన ఏకైక వ్యక్తి అన్నది నిజం. ఒక పవిత్ర విగ్రహం కంటబడితే చాలు, సెంట్ జోసఫ్ గాలిలో నిటారుగా తేలిపోవడం తరచు జరుగుతూండేది: ఇద్దరు సాధువులు, ఒకరు శిలారూపంలోనూ మరొకరు రక్తమాంసాలతోనూ, గాలిలో పైన, కలిసి గుండ్రంగా తిరుగుతూ కనిపించే వాళ్ళట. మహోన్నతాత్మురాలు - ఆవిలాలో ఉండే సెంట్ తెరీసాకు శరీరం, పైకి తేలిపోవడం చాలా ఇబ్బందిగా ఉండేదట. సంస్థాపరమైన కార్యభారాలు నిర్వర్తించవలసి ఉన్నందువల్ల గాలితో “పైకి తేల్చే” అనుభవాలు రాకుండా ఉండడానికి విఫలప్రయత్నాలు చేసింది. “కాని ప్రభువు మరో విధంగా చేయదలచినప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలు నిష్ఫలమయేవి,” అని రాసిందామె. సెంట్ తెరీసా భౌతికకాయం, స్పెయిన్‌లోని ఆల్బా అనే ఊళ్ళో చర్చిలో ఉంది. ఇది నాలుగు శతాబ్దాలుగా చెక్కుచెదరకుండా ఉంది: దీనికి తోడు పూలవాసనలు కూడా గుబాళిస్తూ ఉంటాయి. ఈస్థలంలో లెక్కలేనన్ని అలౌకిక ఘటనలు సంభవించాయి.