పుట:Oka-Yogi-Atmakatha.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

112

ఒక యోగి ఆత్మకథ

అర్పిస్తాడన్న దానికి సూచన. కృతజ్ఞతగల స్నేహితులంటే, మారు రూపాల్లో ఉండి తన అవసరాలు తాను చూసుకొనే భగవంతుడే.

“స్వామీ, మీరు అద్భుతమైనవారు!” ఒక శిష్యుడు ఈ ఋషి పుంగవుల దగ్గర సెలవు తీసుకుంటూ భక్తిపూర్వకంగా అన్నాడు. “భగవంతుణ్ణి అన్వేషించడం కోసం, మాకు జ్ఞానోపదేశం చెయ్యడం కోసం మీరు సంపదలూ సౌఖ్యాలూ అన్నీ త్యాగం చేసేశారు!” భాదురీ మహాశయులు చిన్నతనంలో, ఏకైక లక్ష్యంతో యోగమార్గంలోకి ప్రవేశించేటప్పుడు, పెద్దలిచ్చిన గొప్ప సంపదను విడిచి పెట్టేశారన్నది లోకప్రసిద్ధం.

“విషయాన్ని తారుమారు చేస్తున్నావు నువ్వు!” ఆ యోగి ముఖంలో మెత్తటి మందలింపు ఉంది. “నేను అనంతమైన ఆనందంతో కూడిన విశ్వసామ్రాజ్యం కోసం పనికిమాలిన రూపాయలూ, కొన్ని చిల్లరచుల్లర సుఖాలూ మట్టుకే విడిచిపెట్టేశాను. అటువంటప్పుడు నేను, నా కేమీ లేకుండా చేసుకోడమేమిటి? ఒక గొప్ప నిధిని ఇతరులతో పంచుకోడంలో ఉన్న ఆనందం నాకు తెలుసు. అది కూడా ఒక త్యాగమేనా? కురచ చూపుగల లోకులే నిజమైన త్యాగపురుషులు! ఒక గుప్పెడు ప్రాపంచికమైన ఆటబొమ్మలకోసం, అసమానమైన దివ్యసంపదల్ని త్యాగంచేస్తున్నారు!”

త్యాగాన్ని గురించిన ఈ విరోధాభాస దృష్టికి నాలో నేను నవ్వుకున్నాను – గర్విష్ఠులైన కోటీశ్వరులను అనుకోని త్యాగపురుషులుగా మార్చేసి, సాధువయిన ఏ బిచ్చగాడి నెత్తినయినా కుబేర కిరీటం పెట్టేటట్టుగా ఉందిది.

“భగవంతుడు ఏర్పరిచిన జీవిత క్రమం, భీమా కంపెనీ కంటె కూడా తెలివిగా మన భవిష్యత్తును అమర్చి ఉంచుతుంది.” స్వామివారు పలికిన తుది పలుకులు, తమ విశ్వాసాన్ని స్వయంగా అనుభవసిద్ధం