పుట:Oka-Yogi-Atmakatha.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

టైగర్ స్వామి

103

“తరవాత నాకు కష్టకాలం వచ్చింది. నెత్తురు విషపూరితమైనందు వల్ల ఆరు నెల్లపాటు మృత్యుముఖంలో ఉన్నాను. కూచ్ బిహార్ విడిచి వెళ్ళడానికి తగినంత స్వస్థత చేకూరగానే, నేను మా స్వగ్రామానికి తిరిగి వచ్చేశాను.

“ ‘తెలివిగా నన్ను ముందుగానే హెచ్చరించిన సాధుపుంగవుడే నా గురువని నాకు తెలుసు.’ ఈ మాట నాన్నగారికి వినయంగా చెప్పాను. ఆయన ఎక్కడున్నారో కనుక్కోగలిగితే ఎంత బాగుండును!’ నా కోరిక చిత్తశుద్ధితో కూడినది. కనకనే ఆ సాధువు ఒకనాడు అనుకోకుండా వచ్చారు.

“ ‘పులుల్ని అణచడం ఇంక చాలు. ప్రశాంత నిర్భర స్వరంలో అన్నారాయన. ‘నాతో రా; మానవ మనస్సనే అడవుల్లో సంచరించే అజ్ఞాన మృగాల్ని అణచడం ఎలాగో నేర్పుతాను. ప్రేక్షకులముందు ప్రదర్శన లివ్వడానికి అలవాటుపడ్డవాడివి; యోగంలో నువ్వు సాదించే ఘనవిజయాన్ని దేవతల ముందు ప్రదర్శించి వాళ్ళకి వినోదం కలిగిద్దువు గాని!’

“ఋషుతుల్యులైన ఆ గురువుగారే నన్ను ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశపెట్టారు. చాలాకాలం వాడకం లేక, తుప్పుపట్టి బెట్టుపట్టిన ఆత్మ ద్వారాల్ని తెరిచినవారు ఆయన. నా శిక్షణ నిమిత్తమై త్వరలోనే మే మిద్దరం కలిసి హిమాలయాలకు వెళ్ళిపోయాం.”

తుఫానులా సాగిన, తమ జీవితాన్ని గురించి మాకు స్థూలంగా చెప్పినందుకు కృతజ్ఞులమై నేనూ, చండి ఆ స్వామివారి పాదాలకు మొక్కాం. ఆయన దర్శనం కోసం, చలిచలిగా ఉండే గదిలో చాలాసేపు కాసుకొని కూర్చున్నందుకు ఫలితం సమృద్ధిగా కలిగిందని నేనూ నా స్నేహితుడూ సంతోషించాం.