పుట:Oka-Yogi-Atmakatha.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

102

ఒక యోగి ఆత్మకథ

తెంపుకొని నా వీపు మీదికి దూకింది. నా బుజం దాని కోరల్లో చిక్కింది; నేను కుప్పగూలిపోయాను. కాని మరుక్షణంలోనే దాన్ని నేల మీద పడగొట్టి అణచిపారేశాను. నిర్దాక్షిణ్యంగా నేను గుద్దిన గుద్దులకు అది, ఒళ్ళు తెలిసీ తెలియని స్థితిలో పడింది. ఈసారి దాన్ని ఇంకా జాగ్రత్తగా కట్టిపడేశాను. మెల్లగా బోనులోంచి బయటికి వచ్చాను.

“ఈసారి నాకు కొత్తరకం అరుపులు వినవచ్చాయి; ఆనందంతో అరిచిన అరుపు లవి. జన మందిరి గొంతులూ కలిసి బ్రహ్మాండమైన ఒకే గొంతుతో అరిచినట్టున్నాయి. నేను తీవ్రంగా గాయపడ్డప్పటికీ, పెట్టిన మూడు షరతులూ పాటించాను- పులికి స్పృహ తప్పేటట్టు చెయ్యడం, గొలుసుతో కట్టిపడెయ్యడం, ఎవరి సహాయమూ అవసరం లేకుండా నా అంతట నేనే బయటికి రావడం. అంతే కాదు; ఆ పొగరుబోతు పులిని దారుణంగా చితగొట్టడమే కాకుండా, ఎంతగా బెదరగొట్టానంటే- సమయానికి చిక్కిన బహుమానంలా దాని నోట్లోకి దూర్చిన తలను కూడా ఉపేక్షించి ఊరుకుందది.

“నా గాయాలకు మందువేసిన తరవాత, పూలదండలు వేసి నన్ను ఘనంగా సన్మానించారు. బంగారు కాసులు అనేకం నా కాళ్ళ దగ్గర జల్లుగా కురిశాయి. నగరం యావత్తు పండుగ జరుపుకొంటున్నంత ఉల్లాసంగా ఉంది. ఎన్నడూ కనీ వినీ ఎరగనంత పెద్ద, క్రూరమైన పులిని చిత్తు చేసినందుకు నా గురించి అన్ని చోట్లా అంతులేకుండా చెప్పుకున్నారు. అన్న మాట ప్రకారం, ఆ రాజా-బేగంను నన్నే తీసుకోమన్నారు. కాని నా కేమీ ఉత్సాహం కలగలేదు. ఒక రకమైన ఆధ్యాత్మిక పరిణామం నాలో ప్రవేశించింది. నేను పులి బోనులోంచి చివరిసారిగా బయటికి రావడంతోనే, ప్రాపంచికమైన నా ఆశలన్నిటికీ ద్వారం మూసేసినట్టు అనిపించింది.