పుట:Oka-Yogi-Atmakatha.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

టైగర్ స్వామి

101

కోరలూ గల ఆ పులిముందు నేను, ఒంటిచేత్తో కాసుకోవలసి ఉన్నందువల్ల దాని వాతపడే పరిస్థితిలో పడ్డాను. అయినా దానికి దిమ్మ తిరిగేటట్టు దెబ్బ తియ్యకపోలేదు. ఇద్దరమూ చావో బతుకో తేల్చుకోవలసినంత తీవ్రంగా పెనుగులాడుతున్నాం. బోను బోనంతా గందరగోళమయి పోయింది; నెత్తురు అన్ని వైపులకీ చిమ్మేసింది. బాధా కసీ కలిసిన గాండ్రింపులు దాని గొంతులోంచి వెలువడుతున్నాయి.

" ‘కాల్చండి! ‘పులిని చంపండి!’ అంటూ ప్రేక్షకుల్లోంచి కేకలు వినవచ్చాయి. ఈ పెనుగులాటలో మనిషి మృగమూ కూడా వడివడిగా తిరుగుతుండడం వల్ల, రక్షక భటుడు కొట్టిన తుపాకిగుండు గురి తప్పిపోయింది కూడా. నేను నా సంకల్పశక్తి నంతనూ కూడగట్టుకొని భయంకరంగా హుంకరిస్తూ చిట్టచివరి చావుదెబ్బ కొట్టాను. పులి కూలబడి పోయి చడీ చప్పుడూ లేకుండా పడుకుంది.

“పిల్లిలాగ!” అన్నాను మధ్యలో, ఉండబట్టలేక.

నా మాటకు మెచ్చుకుంటున్నట్టుగా నవ్వారు స్వామీజీ. తరవాత, మంచి పట్టుగా సాగుతున్న కథ మళ్ళీ కొనసాగించారు.

“చివరికి రాజా-బేగం ఓడిపోయింది. తరవాత దాని రాజగర్వం మరింత అణిగిపోయింది. గాయాలతో చిట్లిపోయిన నా చేతులతో, జబర్దస్తీగా దాని దవడలు పెగలదీసి, నాటక ఫక్కీలో రంజింపజెయ్యడం కోసం, ఒక్క క్షణం మృత్యుముఖంలో తలదూర్చి ఉంచాను. గొలుసు కోసం చుట్టూ చూశాను. నేల మీదున్న గుట్టలోంచి ఒక గొలుసు లాగి పులి మెడకు బిగించి బోను కడ్డీలకు కట్టాను. విజయోత్సాహంతో గుమ్మం వేపు నడిచాను.

“కాని, రాకాసి పుట్టుక పుట్టిన ఆ రాజా - బేగంకు, పుట్టుమూలానికి తగ్గ రాకాసి బలం ఇంకా ఉంది. బలంగా ఒక్క ఊపుతో గొలుసు