పుట:Oka-Yogi-Atmakatha.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

94

ఒక యోగి ఆత్మకథ

“ ‘నాన్నగారూ, మీ మాటలు వింటుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది! పులుల సంగతి మీకు బాగా తెలుసు - అవి అందమైనవే కాని కనికరం లేనివి! ఏమో, ఎవరికి తెలుసు? నా పిడిగుద్దులు, వాటి మొద్దుబుర్రల్లోకి కాస్తంత విచక్షణ జ్ఞానాన్ని ఎక్కిస్తాయేమో! వాటికి సాధువర్తన అలవరచడానికి, అడవిని చక్కదిద్దే బడిలో నేనే హెడ్మాస్టర్ని!’ ”

“ ‘నాన్నగారూ, నన్ను పులుల్ని మచ్చికచేసే వాడిలాగే చూడండి. పులుల్ని చంపేవాడినని ఎన్నడూ అనుకోకండి. నేను చేసే మంచి పనులు నాకు చెరుపు ఎందుకు చేస్తాయి? నా జీవిత మార్గాన్ని మార్చుకోవాలన్న ఆజ్ఞ ఏదీ విధించవద్దని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను.’ ”

చండీ, నేనూ ఎంతో శ్రద్ధగా వింటున్నాం; వెనకటి సంకటస్థితి అర్థం చేసుకుంటూ, భారతదేశంలో పిల్లలెవరూ తల్లిదండ్రుల కోరికలను తేలికగా తీసిపారేసి చిత్తం వచ్చినట్టు నడుచుకోరు. టైగర్ స్వామిగారు ఇంకా ఇలా చెప్పారు:

“ నే నిచ్చే సంజాయిషీని నాన్న గారు, నిర్వికార మౌనం వహించి విన్నారు. విన్న తరవాత గంభీరంగా ఒక విషయం వెల్లడించారు.

“ ‘నాయనా, జరగబోయేదాన్ని గురించి ఒక సాధువు నోట్లోంచి వచ్చిన అశుభ విషయాన్ని చెప్పక తప్పని పరిస్థితి తెస్తున్నావు. ప్రతి రోజులాగే నిన్న నేను వరండాలో కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉండగా ఆయన వచ్చాడు.

“ ప్రియమిత్రమా, కలహప్రియుడైన నీ కొడుక్కి ఒక సందేశం తీసుకువచ్చాను. వాణ్ణి కిరాతకమైన పనులు మానెయ్యమను. లేకపోతే, ఈసారి పులితో పోట్లాటకు తలపడ్డప్పుడు తీవ్రమైన గాయాలకు గురిఅయి, ఆరు నెల్లపాటు ప్రాణాంతకమైన జబ్బుతో బాధపడతాడు. అప్పుడిక వెనకటి నడవడి విడిచిపెట్టి సన్యాసి అవుతాడు.” ’