పుట:Oka-Yogi-Atmakatha.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

92

ఒక యోగి ఆత్మకథ

అలాగే మనస్సు కూడా శరీరం చెప్పినట్టల్లా లోబడి, దానికి బానిస అవుతుంది.”

ఆ స్వామీజీ మా కోరిక మన్నించి, తమజీవితాన్ని గురించి కొంత చెప్పడానికి అంగీకరించారు.

“మొట్టమొదట్లో నాకున్న పెద్ద కోరికల్లా, పెద్దపులులతో పోట్లాడాలని. నా మనస్సంకల్పం బలిష్ఠమైనదే కాని నా శరీరం దుర్బలంగా ఉండేది.”

ఆ మాటకు నాలోంచి ఆశ్చర్యం వ్యక్తమయింది. భీముడులాంటి భుజబలమున్న ఈయన, ఎన్నడయినా బలహీనత అన్నది ఎరుగునంటే నమ్మలేననిపించింది.

“ఆరోగ్యమూ బలమూ చేకూర్చుకోవాలన్న గట్టి పట్టుదలతో, ఆ లోపం పోగొట్టుకున్నాను. రాయల్ బెంగాల్ పులుల్ని నిజంగా లొంగ దీసుకునేటట్టు చేసినది నా ఉద్ధత మనోదార్ఢ్యమేనని చెప్పక తప్పదు.

“పూజ్య స్వామీజీ, నే నెప్పటికయినా పెద్దపులులతో పోట్లాడగల నంటారా?” అల్లాటి విపరీతమైన కోరిక నా మనస్సులో చొరబడ్డం అదే మొదటిసారీ చివరిసారీ కూడా!

“ఆహా!” అంటూ నవ్వారాయన. “కాని, పులులు చాలా రకాలున్నాయి; మానవుల కోరికలనే అడవుల్లో తిరుగుతుంటాయి కొన్ని. మామూలు జంతువుల్ని స్పృహ తప్పేటట్టు కొట్టడంవల్ల ఆధ్యాత్మికంగా లాభమేమీ కలగదు. అంతకంటే, లోపల తిరిగే క్రూరమృగాల్ని జయించు.”

“అయ్యా, అడవిపులుల్ని అణిచేసే మీరు, తీవ్రమైన మనోవికారాల్ని అణిచేవారుగా ఎలా మారారో చెప్తారా?”