పుట:Oka-Yogi-Atmakatha.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

టైగర్ స్వామి

89

పించినా, లోపలికి రమ్మన్నందుకే ధన్యులమనుకున్నాం, నేనూ నా స్నేహితుడూ. అక్కడ చాలాసేపు ఎదురు చూస్తూ కూర్చోడంతో మాకు అనుమానం వచ్చింది. సత్యాన్వేషకుడికి ఓర్పు అవసరమన్నది భారతదేశ సాంప్రదాయిక నియమం; తనని చూడ్డానికి వచ్చేవాడి కుతూహలం ఎంత గాఢమైనదో తెలుసుకోడానికి, కావాలనే గురువు పరీక్షించవచ్చు. పాశ్చాత్య దేశాల్లో వైద్యులూ దంతవైద్యులూ చికిత్సకోసం వచ్చేవారి మనఃప్రవృత్తిని స్వేచ్ఛగా పరీక్షిస్తూనే ఉంటారు!

చివరికి ఆ పనివాడు పిలిచాక, చండీ నేనూ ఒక పడగ్గదిలో అడుగు పెట్టాం. ప్రసిద్ధులైన సొహాంగ్ (సో౽హం) స్వామి వారు[1] పక్కమీద కూర్చుని ఉన్నారు. బ్రహ్మాండమైన ఆయన విగ్రహం కంటబడే సరికి మేము ఏమిటో అయిపోయాం. కళ్ళు ఇంత చేసుకుని, నోట మాట లేకుండా స్తంభించిపోయాం. అంత భారీ సైజులో ఉన్న ఛాతీ కాని, పెద్ద బంతుల్లాటి కండలు తిరిగిన జెబ్బలు కాని అంతకుముంచెన్నడూ మేము చూడలేదు. మంచి దిట్టంగా ఉన్న మెడపైన, ఆయన ముఖం భీకరంగా ఉన్నప్పటికీ ప్రశాంతంగానే ఉంది. పొడుగాటి ఉంగరాలు తిరిగిన జుట్టు, గడ్డం, మీసాలు దానికి శోభ నిస్తున్నాయి. ఆయన నల్లటి కళ్ళలో పావురం మాదిరి, పెద్దపులి మాదిరి లక్షణాలు రెండూ గోచరిస్తున్నాయి. బలమైన నడుము చుట్టూఉన్న ఒక్క పులిచర్మం తప్పిస్తే, మొత్తానికి ఆయన దిగంబరంగానే ఉన్నారు.

నేనూ, నా స్నేహితుడూ ఎలాగో మాటలు పెకల్చుకుని, ఆ సన్యాసికి నమస్కారం చేశాం; పులుల్ని లొంగదీసుకోడంలో ఆయనకు గల అసాధారణమైన శౌర్యాన్ని ప్రశంసించాం.

  1. ‘సొహాంగ్’ అన్నది ఆయన సన్యాసం తీసుకున్నప్పుడు పెట్టుకొన్న పేరు! జనసామాన్యంలో మాత్రం ‘టైగర్ స్వామి’ గానే ప్రసిద్ధులు.