పుట:Oka-Yogi-Atmakatha.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

“గంధబాబా” అద్భుతాల ప్రదర్శన

83

వాసనే వాసన చూస్తూంటే ఆమె ముఖంలో వినోదంతో కూడిన విస్మయం ఆవరించింది. దాంతో నా అనుమానాలు తొలగిపోయాయి; ఆ వాసనలు నా ఒక్కడికే అలా అనిపించేటట్టుగా, గంధబాబాగారు నన్ను స్వయం సమ్మోహన స్థితికి గురిచేశారేమో అనుకున్నాను కాని, అలా జరగలేదని తెలిసిపోయింది.

తరవాత ఒకసారెప్పుడో, అలకనందుడనే మా స్నేహితుడు, ఈ గంధబాబాకి ఒక అపురూపశక్తి ఉందన్నాడు. ప్రపంచంలో ఆకలితో నకనకలాడే కోట్లాది ప్రజలకే కనక ఆ శక్తి ఉండి ఉంటే ఎంత బాగుండునో అనిపించింది.

“ఒకసారి బర్ద్వాన్‌లో గంధబాబాగారి ఇంటికి వచ్చిన వందమంది అతిథుల్లో నేనూ ఉన్నాను,” అంటూ అలకనందుడన్నాడు. “అదొక బ్రహ్మాండమైన ఉత్సవం. ఈ యోగికి, గాలిలోంచి వస్తువులు సృష్టించే శక్తి ఉందని పేరు. అంచేత నేను నవ్వుతూ, ఆ ఋతువులో దొరకని టాంజిరీన్ నారింజలు సృష్టించమని ఆయన్ని కోరారు. తక్షణమే, అరిటాకు విస్తళ్ళలో వడ్డించిన లూచీలు (రొట్టెలు) పైకి ఉబ్బి, వాటిలో ఒలిచి పెట్టిన టాంజిరీన్ నారింజలు ఉన్నాయని రుజువుచేశాయి. రుచి ఎలాగుంటుందో ఏమోనని సంశయిస్తూ నేను కొరికి చూశాను కాని, రుచి చాలా బాగుందనిపించింది.”

కొన్నేళ్ళ తరవాత నేను, ఈ గంధబాబాగారు వాటిని ఎలా సృష్టించేవారన్న విషయం, నా అంతస్సాక్షాత్కారం వల్ల తెలుసుకున్నాను. ప్రపంచంలో ఆకలితో అలమటించే కోట్లాది ప్రజలకు ఈ పద్ధతి అందుబాటులో లేకపోవడం ఎంత విచారకరమైన విషయం!

మానవుడు ప్రతిక్రియ చూపే, శబ్దస్పర్శరూపరసగంధ సంబంధమైన ఇంద్రియోత్తేజకాలు, ఎలక్ట్రాన్ ప్రోటాన్లలోని స్పందన తారతమ్యాల