పుట:Oka-Yogi-Atmakatha.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

“గంధబాబా” అద్భుతాల ప్రదర్శన

79

ధైర్యం చెయ్యలేదు. కాని మావాడు మళ్ళీ ఒక్క ఉదుటున ఉరుక్కొచ్చి నన్ను కలుసుకుని సరదాగా నా భుజం పట్టుకున్నాడు.

“గంధబాబా గురించి నీకు చెప్పడం మరిచిపోయాను; అదుగో ఆ ఇంటికే దయచేశారాయన,” అంటూ కొద్ది గజాల దూరంలో ఉన్న ఇంటిని చూపించాడు. “ఆయన్ని తప్పకుండా కలుసుకో; సరదాగా ఉంటుంది. అసామాన్యమైన అనుభవమేదైనా కలగొచ్చు నీకు. వస్తా,” అంటూ ఈసారి నిజంగానే వెళ్ళిపోయాడు.

కాశీఘాట్ ఆలయం దగ్గర సాధువు, సరిగ్గా ఇలాగే చెప్పిన జోస్యం నా మనస్సులో మెదిలింది. కుతూహలంతో నేను ఆ ఇంట్లోకి ప్రవేశించాను. విశాలమైన ఒక హాలులోకి నన్ను తీసుకువెళ్ళారు. అక్కడ, నారింజవన్నె తివాసీ మీద అక్కడక్కడకొందరు బాసెనపట్టు వేసుకుని కూర్చుని ఉన్నారు. భక్తిభావంతో గుసగుసలాడుతున్న మాటలు నా చెవిని పడ్డాయి:

“చిరతపులి చర్మం మీద గంధబాబాని చూడు. వాసనలేని పువ్వుకు దేనికైనా ఆయన, సహజమైన వాసన తెప్పించలరు. వాడిపోయిన పువ్వును దేన్నయినా, తాజాగా విచ్చుకొన్నట్టు చెయ్యగలరు; లేదా, మనిషి చర్మంలోంచి ఆహ్లాదకరమైన పరిమళం రప్పించగలరు.”

నేను సూటిగా సాధువు వేపు చూశాను; ఆయన చురుకైన చూపు నా మీద నిలిచింది. ఆయన బొద్దుగా ఉన్నారు; గడ్డం పెంచాడు. ఒంటి చాయ నలుపు. పెద్దపెద్ద కళ్ళు మెరుస్తున్నాయి.

“అబ్బాయి, నిన్ను చూస్తే సంతోషంగా ఉంది. నీకేం కావాలో చెప్పు, ఏదైనా సువాసన కావాలా?”