పుట:Nutna Nibandana kathalu.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అది దైవచిత్తమని గుర్తించి పౌలు మాసెడోనియా రాష్ట్ర రాజధానియైన ఫిలిప్పికి వెళ్లాడు. శనివారం యూదుల ప్రార్థనా సమావేశానికి వెళ్లి క్రీస్తుని బోధించాడు. అక్కడకు లూదియ అనే అన్యజాతి స్త్రీ వచ్చింది. ఆమె అద్దకం వేసిన పట్టుబట్టలు అమ్మకొనేది. పౌలు బోధ విని ఆమె క్రీస్తుని విశ్వసించింది. ఇంటిల్లిపాదిగా జ్ఞానస్నానం పొందింది.

ఆ నగరంలో దయ్యం సోకిన స్త్రీ సోదె చెప్పి యాజమానులకు డబ్బు సంపాదించి పెడుతుండేది. ఆమె పౌలు బృందాన్ని చూచి వీళ్లు దైవ సేవకులు, రక్షణ మార్గం తెలియజేసేవాళ్లు అని మాటిమాటికి అరవడం మొదలుపెట్టింది. పౌలు విసుగు చెంది నీవు ఈమెను విడిచి వెళ్లమని దయ్యాన్ని ఆజ్ఞాపించగా అది వెళ్లిపోయింది. దానితో ఆమెకు సోదె చెప్పే శక్తి నశింపగా యజమానులకు ఆదాయం పడిపోయింది. వాళ్లు ఆగ్రహం చెంది పౌలునీ సీలానూ న్యాయస్థానానికి తీసికొని పోయారు. ఈ యూదులు మాకు సమ్మతంగాని ఆచారాలు బోధించి మా ప్రజల్ని అపమార్గం పట్టి స్తున్నారు అని నేరం తెచ్చారు. న్యాయమూర్తులు వారిని కొరడాలతో కొట్టించి చెరలో త్రోయించారు. అర్థరాత్రిలో పౌలు సీలాలు దేవుణ్ణి స్తుతించి గీతాలు పాడుతూండగా భూకంపం కలిగి చెరసాల తలుపులు తెరుచు కొన్నాయి. ఖైదీల సంకెలలు ఊడిపడ్డాయి. చెరసాల అధికారి మేల్కొని ఖైదీలు పారిపోయారనుకొని ఆత్మహత్య చేసుకోవానికి పూనుకొన్నాడు. కాని పౌలు అతన్నివారించాడు. అతడు పౌలు కాళ్లపైబడి రక్షణమార్గం తెలియజేయమని వేడుకొన్నాడు. పౌలు నీవు క్రీస్తుని విశ్వసించమని చెప్పాడు. అతడు పౌలు బోధ విని కుటుంబ సమేతంగా జ్ఞానస్నానం పొందాడు. తర్వాత పౌలు సీలాలు లూదియా యింటిలో ప్రోగయిన విశ్వాసులను ప్రోత్సహించి ఫిలిప్పీని వీడి తెస్సలోనిక నగరానికి వెళ్లారు. అక్కడి ప్రార్థనా మందిరంలో యెసే మెస్సీయా అని మూడుసార్లు బోధింపగా చాలమంది విశ్వసించారు.