పుట:Nutna Nibandana kathalu.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వెంటనే వాడు లేచి నడచి వారితో పాటు దేవాలయం లోకి వెళ్లాడు. అది చూచి జనం ఆశ్చర్యపోయి పెద్ద గుంపుగా ప్రోగయ్యారు. పేతురు వారికి క్రీస్తుని బోధించాడు. మా శక్తి వలన గాక యేసు క్రీస్తు శక్తి వలననే యితనికి నడక వచ్చింది. జీవనదాతను మీరు సిలువ వేసి చంపారు. ఐనా దేవుడు అతన్ని జీవంతో లేపాడు. ఇప్పడు మీరు మీ పాపాలకు పశ్చాత్తాపపడి అతన్ని విశ్వసించి రక్షణం పొందండి అని బోధించాడు.

ప్రభువు చనిపోయి మరల వుత్థాన మయ్యాడని పేతురు చెప్తుండగా విని యూదనాయకులు మండిపడ్డారు. వారిని బంధించి చెరసాలలో పెట్టారు. కాని పేతురు బోధవిని ఐదువేలమంది క్రైస్తవ సమాజంలో చేరారు.

మరునాడు ఉదయం యూదనాయకులు మీరు ఏశక్తితో ఈ యద్భుతాన్ని చేశారని ప్రశ్నించారు. పేతురు ఆత్మప్రేరితుడై అధికారులారా! యేసు శక్తితోనే మేము కుంటివాణ్ణి నడిపించాం. యేసు నామం మీదిగానే అందరికీ రక్షణం లభిస్తుంది. ఇంకెవరివలనా రక్షణం రాదు అని ధైర్యంగా చెప్పాడు. చదువు సంధ్యలు లేని శిష్యులు అంత ధైర్యంగా మాటలాడ్డం చూచి అధికారులు ఆశ్చర్యపోయారు. ఆ మీదట యేసుని గూర్చి బోధించవద్దని వారిని ఖండితంగా ఆజ్ఞాపించారు. ఐతే పేతురు యోహానులువారిని ఎదిరించి మేము మీరు చెప్పినట్లు చేయలా లేక దేవుడు చెప్పినట్లు చేయాలా? మేము కన్నులారా చూచిన విషయాన్ని గూర్చి మాటలాడకుండ వుండాలా అని ప్రశ్నించారు.కుంటివాడు కూడ అక్కడే వున్నాడు కనుక అధికారులు ఆ యద్భుతాన్ని కొట్టి పారేయలేక పోయారు. శిష్యులను శిక్షిస్తే ప్రజలు తిరగబడతారని భయపడ్డారు. కనుక వారిని బెదరించి వదలిపెట్టారు. తర్వాత శిష్యులంతా ప్రోగయి ధైర్యంగా క్రీస్తుని బోధించే శక్తి కొరకు ప్రార్థించారు. వారున్న స్థలం కంపించగా పవిత్రాత్మ వారికి బలాన్ని చేకూర్చింది.