పుట:Neti-Kalapu-Kavitvam.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

58

వాఙ్మయ పరిశిష్టభాష్యం -- నేటికాలపుకవిత్వం


హెచ్చుగా కనబడుతున్నవి. యెంకిపాటల వలె కావ్యత్వ సిద్ధిపొందినవి అరుదుగా కనబడుతున్నవి.

ఆక్షేపం.

అవునయ్యా, ఈ రోజుల్లో మీరన్నట్లు స్వరూపసిద్ధి అయ్యేదాకా కావ్యం వ్రాస్తే చదవడానికి యెవరికీ తీరదు. అదిగాక పత్రికలవారికి చిన్న చిన్న పద్యాలు పద్యసంచయాలు అయితే అనుకూలిస్తవి, కనకనే చిన్న కృతులు వ్రాస్తున్నారు, అదిగాక ప్రజలరుచులు చిన్న వాటిమీదనే వున్నవి. అని అంటారా?

సమాధానం

చెప్పుతున్నాను. తీరిక లేదనేమాట నేనొప్పుకోను. యేమితోచక యెందరోకాలాన్ని యెట్లానో నెట్టడం మన మెరుగుదుము. చీట్లాడడం యెరుగుదుము. కనుక తీరికెలేదంటే అంగీకరించజాలను. కావ్యాసక్తి గలవారిలో కొందరైనా తీరికగలవారున్నారు. ఇఘ పత్రికలవారికి తీరిక లేనివారికి చిన్నచిన్న వి కావలెనంటె కావలసి వుండవచ్చును. అంతమాత్రం చేత ఉత్తమకవిత్వ మెట్లా అవుతుంది? ఆపద్యాలు ఉత్తమకావ్య మెట్లా అవుతవి? వార్తలవలెయిది చదివి పారవేయడానికి పనికివస్తవంటే, ఇవి పత్రికలవారి వ్యాపారానికి తీరికెలేనివారికి వేసే చిల్లరముక్కలంటే. నాకు విప్రతిపత్తిలేదు. అప్పుడు నావిచారణ ఆవశ్యకంగాదు. ఇక ప్రజలరుచులంటారా? ప్రజలరుచులకు సేవచేయడానికి కవులు వేశ్యలూ, వర్తకులూగారు గదా.

"యథాస్మై రోచతే విశ్వం తథేదం పరివర్తతే" (ధ్వన్యా)

(కవికి విశ్వమెట్లా ఇష్టమైతే అట్లా పరివర్తనపొందుతుంది) అని ఆనందవర్ధను డన్నట్లు సర్వలోకాన్ని వశీకరించి ఉత్తమమార్గాన నడపవలసినకవి ప్రజలరుచులకు సేవచేసే వేశ్యాపదవిని వణిక్థ్సానాన్ని పొందడం హైన్యం.

అని శ్రీ ... ఉమాకాన్త విద్యాశేఖరకృతిలో వాఙ్మయసూత్ర

పరిశిష్టంలో నిదర్శనాధికరణం సమాప్తం.