పుట:Neti-Kalapu-Kavitvam.pdf/87

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

52

వాఙ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం


"అగ్నిరుష్ణో జలం శీతం శీతస్పర్శ స్తథానిలః,
 కేనేదం చిత్రితం తస్మాత్ స్వభావాత్ తద్ వ్యవస్థితిః" (సర్వ)

(అగ్ని, వుష్ణం. జలం, శీతం, గాలి. శీతస్పర్శం యిదంతా యెవరు చిత్రించారు? స్వభావంవల్లనే యిదంతా యేర్పడుచున్నది). అని నిదర్శనాలను చెప్పుతున్నది. ఇవి శాస్త్రసందర్భాలు. అక్కడ సయితం మితత్వాన్ని అతిక్రమించలేదు. పరిణతబుద్దులకు భావాన్ని అందిస్తూ రసాస్వాదం కలిగించవలసిన కావ్యంలో కాళిదాసాదులు ఔచిత్యం పరిపాలించి నిదర్శనపరంపరలు లేకుండా కావ్యసౌందర్యాన్ని కాపాడినారు. కాని యీకాలపుకృతికర్తలకు యీవివేకం నశించింది. నిదర్శనం మొదలు పెట్టితే వుడుకుబోతువుపన్యాసంలోకి దింపి విసుగూ రోతా పుట్టిస్తున్నారు.

దుఃఖంలో ఆశ. దాన్ని నిరూపించడానికి కృష్ణపక్షకర్త

"కన్నీటికెరటాల వెన్నెలేలా?
 నిట్టూర్పుగాడ్పులో నెత్తావియేలా ?"

అని అన్నాడు. ఇంతటితో వూరుకోలేదు.

"ప్రళయకాలమహోగ్ర భయదజీమూతోరు
 గళఘోరగంభీర ఫెళ ఫెళార్భటులలో మెర పేలా"

అని ఉడుకెక్కించాడు. ఇంకో ఊరుకోలేదు.

"అశనిపాతమ్ములో నంబువేలా?"

అన్నాడు. ఇంకా ఊరుకోలేదు.

"హాలాహలమ్ములో నమృతమేలా"
 
అని ఇంతటితో చాలించలేదు.

"ప్రబలనీరంధ్రాభ్ర జనితగాడధ్వాంత,
నిబిడ హేమంత రాత్రీ కుంతలములలో చుక్కేలా"

అని అన్నాడు. ఇంతటితో విరమించలేదు.

"శిథిలశిశిరమ్ములో జివురేలా?"
 
అన్నాడు. కాని ఊరుకోలేదు.

"పాషాణపాళిపై బ్రసవమేలా?"
 
అని అన్నాడు. ఇంకా వదలలేదు.