పుట:Neti-Kalapu-Kavitvam.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంపాదకీయం

"దేశంలో భారతీయ సంస్కార ప్రవాహాలు ఇంకిపోయినవి. విద్యాపీఠాలు అస్తమించినవి. గురుకులాలు రూపు మాసినవి. భారతీయ సంస్కారం లేని కేవల పాశ్చాత్య సంస్కారం బలప్రదం కాక ఆత్మ విముఖత్వాన్ని పర సంస్కార దాస్యాన్ని మనకు ఆపాదించినవి".

ఈ పుస్తకం చివర రాసిన పైమాటల్లో అక్కిరాజు ఉమాకాంతం (1889-1942) గారి సర్వసాహిత్య కృషి నేపద్య సారాంశం తెలుస్తుంది. ఆయన జీవించింది 53 సంవత్సరాలే అయినా అమోఘమైన పాండిత్యంతో అసమాన వాదపటిమతో అవిచ్చిన్న సారస్వత వ్యాసంగంతో తెలుగు సాహిత్య లోకంలో చిరకాలంగా పాతుకు పోయిన విశ్వాసాలను కుదిపి వేసిన సాంస్కృతిక విప్లవకారుడు అక్కిరాజు ఉమాకాంతం గారు ఆయన వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవటానికి ఆయన జీవిత చరిత్ర ఎవరూ రాయలేదు. వావిళ్ళ వేంకటేశ్వర శాస్త్రులు గారి శత జయంతి సంపుటం (1986) లో "త్రిలిఙ్గ తొలినాళ్ళ సంపాదకులు ఉమాకాంత విద్యా శేఖరులు" అనే పేరుతో అక్కిరాజు రమాపతిరావుగారి అయిదు పేజీలు చిరు వ్యాసమూ తెలుగు విజ్ఞాన సర్వస్వము మూడవ సంపుటంగా వచ్చిన 'తెలుగు సంస్కృతి' అనే వాల్యూము (1959) లో అబ్బూరి రామకృష్ణారావుగారి ఒక పేజీకి మించని చిన్న నోటూ మాత్రమే ప్రధాన ప్రయత్నాలుగా కనిపిస్తున్నాయి.

అక్కిరాజు ఉమాకాంతంగారు గుంటూరు జిల్లా పల్నాడు తాలూకా గుత్తికొండ అనే చిన్న గ్రామంలో లక్ష్మమ్మ లక్ష్మీనారాయణ దంపతులకు జన్మించారు. గుత్తికొండకు సుమారు ఏడెనిమిది మైళ్ళ