పుట:Neti-Kalapu-Kavitvam.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

42

వాఙ్మయ పరిశిష్టభాష్యం - నేటి కాలపు కవిత్వం


కాకుంటే దాన్ని లోకంలో వ్యాపించజేసేయత్నమే అనావశ్యకం. దాన్ని లోకానికి వుద్దేశించినప్పుడు దాంట్లో యేమున్నదీ లోకానికి తెలపవలసిన బాధ్యత కర్తకువున్నది. కందులను తన యింట్లో తాను రత్నాలనుకొన్నా కందిపప్పును వరహాలనుకొన్నా బాధలేదు. బయటికి వచ్చి మూట బుజానవేసుకొని రత్నాలో అని అరిస్తే చూపమన్నప్పుడు కందులుచూపి నాలిక వెళ్లబెట్టవలసివస్తుంది. నిజంగా కందులు కావలసిన వాండ్లు అవి రత్నాలనుకొని అతణ్ని పిలిచి కొనకుండానే పోవచ్చును. కావ్యకర్త తన యింటిలో తన కావ్యాలను జడ అని ముడి అని చుట్ట అని కొప్పు అని జడకుచ్చు అని కుచ మని కపోల మని బనారసు చీర అని ముఖమల్లు రవికె అని తనకు ప్రియమైన పేర్లు పెట్టుకొని బులుపుతీర్చుకోవచ్చును గాని లోకానికి వుద్దేశించినప్పుడు ఈవికారపు పనిచేసెనా లోకవంచనా, ఆత్మవంచనా అతని పైన బడుతున్నవి.

న్యాయకుసుమాంజలి, ముక్తావళి, సిద్ధాంతకౌముది ఖండనఖండభాద్యం అనేవి ఆశాస్త్రాలకాఠిన్యాన్ని మృదువుపరచడానికి చేర్చినమాటలు గనుక వీటికి అన్వయించవు. కవిత్వ మసలె మృదువైనది. మనోహరమైనది. దానికి మృదుత్వమనోహరత్వాలు పులిమితే శబ్దవాచ్యత అవుతుంది శబ్దవాచ్యతను ముందు వివరిస్తాను.

ఆక్షేపం

అవునుగాని జడకుచ్చులవంటివి కేవల సంజ్ఞలుగావు. జడకుచ్చులవలె యింపైన పద్యగుచ్చా లిందులో వున్నవని భావం కనుక ఇది లోకమాన్య మహాత్మ అన్నట్లు గుణవాచకం గుణవాచకాలుచితమే గదా అని అంటారా?

సమాధానం

చెప్పుతున్నాను: జడకుచ్చులవలె ఇంపైనవి అని ఆయింపు యితరులు చూచి అనవలసిందిగాని తానే చెప్పుకోవలసిందిగాదు. కాకిబిడ్డ కాక్కి ముద్దు అన్నట్లు యెవరిది వారికి యింపుగానే వుండవచ్చును ఇతరుల కది దొషభూయిష్టంగా కనబడవచ్చును.