పుట:Neti-Kalapu-Kavitvam.pdf/49

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
10
వాఙ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం

సమాధానం

వివరిస్తాను. ఈ కావ్యాల్లో వున్న శబ్ధాలు అర్ధాలు నూతనమంటే అది సరిగాదు. శబ్దాలు అనాదివృద్ధవ్యవహారపరంపరామూలాన వ్యవహృత మవుతున్నవి.

"ఘటేన కార్యం కరిష్యన్ కుంభకారకులం గత్వాహ కురు ఘటం కార్వమనేన కరిష్యామీతి న తద్వచ్చబ్దాన్ ప్రయుయుక్ష మాణో వైయాకరణ కులం గత్వాహ కురుశబ్ధాన్ ప్రయోక్ష్యఇతీ (మహా) అని పతంజలి అన్నట్లు శబ్దాల నెవరూ నిర్మించరు ఇక అర్ధాలుగూడా ఆశబ్దాలకు అనాది వృద్ధవ్యవహారంవల్లనే విదితమవుతున్నవి.

"నిత్యాః శబ్దార్థసంబంధాః సమామ్నాతా మహర్షిభి:" (వాక్య) అని వాక్యపదీయకారుడు చెప్పుతున్నాడు. మీమాంసకు లిట్లానే అంటారు. వాస్తవంగా అర్ధాలు శబ్దాలతో అవినాభావసంబంధంగలిగి వర్తిస్తున్నవే గాని వాటిని కొత్తగా కవులు యేర్పరచరు. నూతనంగా కవులు శబ్ధార్ధాలు నిర్మిస్తే వాటిని ఆ కవులే వివరించవలనుగదా వాటికి ప్రామాణ్య మేమిటి? కనుక ఇప్పటికవిత్వం శబ్దార్దాలవల్ల నూతన మనడానికి వీలులేదు.

కావ్యంలో కొన్ని యీకాలపురోడ్దు రైలువంటి కొత్తమాట లున్నమాత్రాన అవినూతనశకం ఆరంభిస్త వనడం అనుచితం భాషలో కొన్ని కొత్తశబ్దాలు వచ్చిన వనవచ్చును గాని కావ్యంలో యెట్లా నూతనశక మారంభమవుతుంది? కావ్యంలో రసభావాలు ప్రధానం.

ఆక్షేపం

అవునండీ ప్రణయం, లతకూన, చిగురు, లలితం, కన్నె, లేత, కలికికోయిల, కోమలం, దివ్యం, ఆనందం, చారు ఈమాట లీ కావ్యాల్లోవున్నవి. వెనుకటివాటిలో లేవు. ఇవిమీరన్నట్లు కావ్యంలో ప్రధానమైన రసభావాలను ఉపకారకాలు గనుక ఈ కాలపు కావ్యాలు విశిష్టం... అని అంటారా?