పుట:Neti-Kalapu-Kavitvam.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనౌచిత్యాధికరణం

215


"దేశభాషాక్రియావేష లక్షణ్యాః స్యుః ప్రవృత్తయః"
 లోకాదేవావగంతవ్యా యథౌచిత్యం ప్రయోజయేత్"
"పిశాచాత్యంతనీచాదౌ పైశాచం మాగధం తథా
 యద్దేశ్యం నీచపాత్రంతు తద్దేశ్యం తస్యభాషితమ్. (సాహి)

(దేశభేదంచేత భిన్నమైనభాష చేష్ట వేషం ఇట్లాటి నాయక వ్యాపారాలు ప్రవృత్తులు. వీటిని లోకంవల్లగ్రహించి ఔచిత్యాన్ని అనుసరించి కూర్చవలసింది. పిశాచాలకు అత్యంతనీచులకు పైశాచం మాగధం, ఉపయోగించవలెను. నీచపాత్రం యేదేశానికి సంబంధించివుంటే ఆదేశభాష ఆపాత్రానికి వాడవలెను) అని అన్నారు. ఈతీరున ఆ ఆ దేశాల పాత్రలభాష తత్తద్దేశాల నిత్యవ్యవహారంలోనిదిగాదనే అభిప్రాయం అవివేకమూలమని స్పష్టపరచాను. యెంకిపాటల్లోది నాయుడిబావభాషే ననడానికి నాటకప్పాత్రలబాష నిత్యవ్యవహారభాష కాదనే అడ్డుకారణాన్ని తోసివేస్తున్నాను. రాజులు మొదలైనవారు సంస్కృతం నిత్యవ్యవహారంలో వాడుతారా అంటే సంస్కృతం ఒకవేళ వాడితే అట్లానేవాడుతారని సమాధానం. ఛందస్సు వల్ల యేర్పడే క్రమం, అడావుడి, వ్యత్యాసం మొదలైనవితీసివేస్తే సంస్కృతం మాట్లాడేటప్పుడు ఆభాషే మాట్లాడుతారంటున్నాను. అంటే నోరు తిరక్కపోవడం మొదలైన దోషాలు లేనిదశలో ఆసంస్కృతమే మాట్లాడుతారని అభిప్రాయం. ఈనాయుడు తెలుగుదేశస్ధుడే గనుక అతడు తెలుగుమాట్లాడుతాడా మాట్లాడడా అనే విచారణే లేదు. ఛందస్సు అడావుడీ వ్యత్యాసం మొదలైనవి తీసివేస్తే అతడికి అతడిదేశభాగంలో అతడిదశకు సిద్ధమైన భాషనే మాట్లాడినా డని అనుకొనడం కంటె, వేరే మార్గం లేదు. "రామకృష్ణా! చందురుణ్ణి" అని అనవలసివుండగా రామకుష్ట, సెందురుణ్ణి అని యిట్లా అనడం ఛందస్సు కక్కురితిగాదు ఛందస్సు అడావుడీగాదు. అది అతడిభాష కాదనడానికి మరేహేతువులు లేవు కనుక అవి నాయకుడి భాషే అని నిర్ణయిస్తున్నాము.