పుట:Neti-Kalapu-Kavitvam.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శృంగారాధికరణం

165

కనుకనే చోరుల, హంతకుల జారుల శృంగారం హేయ మంటున్నాను.

జగత్సంతతి

శృంగారం జగత్సంతతికి సాధనమని అందుకే ప్రవృత్తిమార్గానికి ఉపోద్బలంగా వీరశృంగారాలు ప్రధానమైన బారతీయ కావ్యప్రస్థ నం వర్తిస్తున్నదని వ్యాఖ్యచేశానని చెప్పినాను. జగత్తులో మనుషులు సుఖంగోరుతారుగాని దుఃఖం పీడా గోరరు. హంతకులు చోరులు పరధనాపహర్తలు. మోసగాండ్లు ఇట్లాటివాండ్లస్థితి లోకానికి పీడాకరమని అందరికీ విదితం. ఇట్లాటివాండ్లుండేలోకం అవిచ్ఛిన్నంగా వుండడానికి బదులు విచ్ఛిన్నమైపోతేనే మంచిదని తోచక మానదు కనుకనే జగత్సంతతి సిద్ధాంతంలో ఇట్లాటి దుష్టులశృంగారం మిక్కిలి హేయమంటున్నాను. దయ. సత్యం, తేజస్సు, స్వాతంత్ర్య౦ ఇట్లాటి కల్యాణగుణాలు వెలిసేలోకం స్వర్గతుల్యంగా వుంటుంది. సుఖ హేతువౌతుంది. సర్వప్రాణిస్పృహణీయమై స్వర్గ్యమైనదాన్ని యెవరు కోరడు? నిత్యనైమిత్తికకామ్యకర్మలచేత జైమిని లోకానికి ప్రాపింపజేయ యత్నించిన ఫలం యీదృశసుఖగర్భితమైయే వున్నది. దయ, సత్యం ప్రేమ, తేజస్సు స్వాతంత్ర్యం ఇట్లాటి కల్యాణగుణాలు వెలిసే స్థితి ధర్మం అర్ధకామాలను అతిక్రమించినపుడే లోకానికి సిద్ధిస్తున్నది. కనుకనే లోకసంతతికి పరమసాధనమైన శృంగారానికి ధర్మరక్షకులను, లోకరంజకులను తేజస్వంతులను ఆలంబనం చేశారని చెప్పుతున్నాను.

అదిగాక లోకానికి అంతటిశ్రేయస్సు సమకూర్చేవారి శృంగారం మనకు ఆనందప్రదంగా వుంటుంది. లోకసంగ్రహంకొరకు పాటుపడే మహాత్ములను మనం ఊరేగిస్తాము. అందుకే ధర్మరక్షకు లయిన రాజులు, మంత్రులు, ధర్మపరాయణులైన ఇతరులు భారతీయకావ్యంలో శృంగారనాయకులుగా వెలయగలిగినారు. అర్ధకామాలు ధర్మానికి