పుట:Neti-Kalapu-Kavitvam.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

164

వాఙ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం


మనుష్యప్రకృతి

కాని; యిట్లాటి ధర్మా ధర్మప్రవృత్తిలేని స్థావరప్రకృతికంటె మనుష్య ప్రకృతి సంస్కారవంతుడైన కవి సమీపించేటప్పటికి, లోకస్థితికి హేతుభూతమైన ధర్మం. దానికి విఘాతం కలిగించే అధర్మం. తప్పించుకో వీలులేనంత అఖండాకృతిలో సర్వస్థలాల గోచరిస్తున్నవి. ప్రవృత్తి మార్గంలో వున్నంతవరకు సత్వరజస్తమనస్సుల ప్రవృత్తులతో శబళితమైన యీమనుష్యప్రకృతి నుండి దుష్టత్వాదుష్టత్వాదులను, సుగుణ దుర్గుణాలను ధర్మాధర్మాలను, అపహ్నవించలేము. అవి వెంటనంటి అగ్నికి ఉష్ణగుణం వలె వుంటునేవున్నవి కనుకనే వాటిని అపహ్నవించలేమంటున్నాము. అందువల్ల మనుష్యప్రకృతిని విషయంగాచేసిన కవి, శిల్పకళ ఆనందఫలకాలైనప్పటికీ మనుష్యప్రకృతినంటి వున్నధర్మాధర్మాదులను అపహ్నవించ లేడంటున్నాను. శిల్పానికి శిల్పస్థితే ప్రయోజనంగాని వేరే ప్రయోజనం లేదంటారా? అది అసంబద్ధం యెవరికో ఒకరికి శిల్పసృష్టియే ప్రయోజనం అయితే కానియ్యండి ఆశిల్పసృష్టికి హేయత్వం ఉపాదేయత్వం ఆనాందాదిఫలాలవల్లనే సిద్ధిస్తున్నవి. కోకిలపాడుతున్నది. గదా అని యెవడూ వినడు. అది ఆనందజనకంగా వుండడం వల్లనే వింటాడు. అట్లానే కవి వ్రాశాడు గదా అని మొగమాటంచేత యెవడూ కావ్యాలను చదవడు, నాటకాలను చూడడం, ఆనందం కొరకు చదువుతాడు. శిల్పం ఆనంద ప్రదమైనప్పుడే ఉపాదేయమవుతుందంటున్నాను. శిల్పానికి శిల్పస్థితే ప్రయోజనమనేమాట అంగీకరించవీలులేదు. దాని గ్రాహ్యత్వాగ్రాహ్యాత్వాలు ఆనందప్రభృతి ప్రయోజనాంతరాలను ఆక్షేపించివున్నవి. ఆనందం ధర్మాధర్మవ్యవస్థితమని యిదివరకే విశదపరచాను. ఇంతకూ చెప్పదలచిందేమంటే శృంగారస్థితే శృంగారప్రయోజన మనేమాట అసంబద్ధమని, శృంగారం మధురం గనుకనే గ్రాహ్యం గాదని, అదిమధురమైనా వుపాధి దూష్యంగా నప్పుడే గ్రాహ్యమని, చెప్పుతున్నాను.