పుట:Neti-Kalapu-Kavitvam.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

156

వాఙ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం

1. రుచిగల ఆహారం తినగోరినవాడిచేత యోగివేషం స్వీకృత మగుతున్నది.

2. స్త్రీలగర్భంలో వుండి స్త్రీలచేతనే వివర్ధితుడవై ఓమూర్ఖుడా వారినే యెట్లా నిందిస్తావు? అహోకృతఘ్నత

(మండనుడు)

3. యెవరిస్తన్యం తాగినావో యెవరి యోనిలోనుండి పుట్టినావో ఆస్త్రీలతోనే ఓమూర్ఖతముడా పశువువలె యెట్లా రమిస్తావు?

4. మైథునకాముడిచేత గృహస్థవేషం స్వీకృతమవుతున్న దనుకొంటాను. (శంకరుడు)

అని యీతీరున కర్మబ్రహ్మ మిమాంసలకు జరిగిన వివాదం జగత్సంతతికి ఆధారమైన స్త్రీపురుష సంయోగాన్ని కర్మమీమాంస యెట్లాపూజించేదీ తెలుపగలదు. ఇట్లాటి జగదవిచ్చిన్నతకు అవశ్యకమై ప్రాణధారణ సాధనమైన ఆహారం సంస్కృతి సాధనమైన సంయోగం రోతగాక, ఉపాదేయత్వాన్నే పొందుతున్నవి. ఆహారాన్ని గూడా విదూషకుడి సందర్భంలో కవులు స్వీకరిస్తూవచ్చారు. ఆహారాన్ని వాల్మీకి అయోధ్యాకాండంలో 91 వ సర్గంలో భరద్వాజుడు భరతుడికి ఆతిథ్యమిచ్చినఘట్టంలో మనోహరంగా వర్ణించాడు. అయితే తరతమ భావంచేత ఆహారంకంటె సంయోగమే జగత్సంతతికి (జగదవిచ్చిన్నతకు) సన్నిహిత కారణం ప్రధానకారణం అయివున్నది. జగస్థితి కారకుడైన శ్రీవిష్ణువును శృంగారానికి అధిదైవతంగా భావించడంలో యీఅభిప్రాయమే వ్యక్తమవుతున్నది. బుభుక్షకంటె సంభోగేచ్చ యెక్కువ ప్రధానంగా స్వీకృతం కావడం ఉచితమంటున్నాను. ఇంతటి మహిమగల శృంగారం కావ్యంలో ప్రధానమని భారతీయులు ఉత్కృష్టమైన ప్రవృత్తిధర్మానికి కావ్యాన్ని అనల్పసాధనంజేసి లోకాభ్యుదయానికి తోడ్పడడంలో వారి అమేయజ్ఞానాన్ని వెలయించారు.