పుట:Neti-Kalapu-Kavitvam.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

112

వాఙ్మయ పరిశిష్టభాష్యం -నేటికాలపుకవిత్వం


ఉద్దిష్టనాయిక సీతా గావచ్చునుగదా. అట్టాటి తుచ్ఛరతి సహృదయులకు అనంగీకార్య మని నేను చెప్పవలసినపనిలేదు. కనుకనే కాళిదాసు "కశ్చిత్ కాంతా" అని ఉద్దిష్టనాయకుణ్ణినాయికను తెలిపినాడు. అసలు ఈరత్యాదిభావాలన్నీ అలంబనాన్ని అంటే నాయికను నాయకుణ్ణిబట్టే వుంటవని ముందు నిరూపించబోతున్నాను.

పూర్వపక్షం

అవునుగాని, దోషంకనబడేదాకా గుణి అనే అనుకోవలెను అనే న్యాయమున్నది. కనుక దుష్టనాయకుడని తేలేదాకా ఉత్తమ నాయకుడనే అనుకోవలెను. కనుక "నేను" అని వున్నప్పుడు అతడెవ్వరో ఉత్తమనాయకుడే నని యేల అనుకోరాదు? అని అంటారా?

సమాధానం

చెప్పుతున్నాను. అది అసంగతం తెలిసేదాకా గుణి అనుకొంటూవుండడం అనుచితం యేదైనా పదార్ధం విషమని తేలేదాకా అది అవిషమనే అనుకొనడం మూర్ఖత్వమే అవుతున్నది. యెందుకంటే అట్లా అనుకొనితింటే అది నిజంగా విషమైనప్పుడు అనర్థ ప్రాప్తికలుగుతున్నది. కనుక యేమీ తెలియనప్పుడు అది విషమనిగాని అనుకొనకతటస్థంగావుండడమే తెలివిగలపని. అట్లానే మనిషి దోషి అనిగాని గుణి అనిగాని తెలియనప్పుడు గుణి అనిగాని దోషి అనిగాని అనుకొనకతటస్థంగా వుండడం వివేకం అట్లానే "నేను" అన్నప్పుడు ఉత్తముడని గాని మధ్యముడనిగాని అధముడనిగాని అనుకోకుండా వుంటాము కనుకనే ఉత్తమత్వం మధ్యమత్వం అధమత్వం, అనేభావన లేమీలేకుండా, అన్యయానికి సరిపొయ్యే కృతికర్తే నాయకుడని అర్ధం చేసుకొంటాము.