పుట:Neti-Kalapu-Kavitvam.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xiv


రచించాడనీ కట్టమంచి రామలింగారెడ్డిగారు చేసిన అభాషణాన్ని విమర్శిస్తూ "కృష్ణరాయలు రచించినా కృష్ణశ్రీష్ఠిరచించినా కృష్ణామాత్యుడు రచించినా, కృష్ణ భట్టు రచించినా, పుస్తకములోని మంచి చెడ్డలు మారవు గనుక ఆ విచారణ నేనిక్కడ పెట్టుకోలేదు" అని వస్తుగత విమర్శ ప్రాముఖ్యాన్ని నొక్కి చెప్పారు.

కట్టమంచి రామలింగా రెడ్డిగారు మద్రాసు గోక్లేహాల్లో ఇచ్చిన ఉపన్యాసాన్ని పత్రికల్లో చదివి వాఙ్మయ పత్రికలో విమర్శించారు. రామాయణం కంటే భారతం ప్రాచీనం అని రెడ్దిగారా ఉపన్యాసంలో చెప్పారు. భారతం కావ్యంకాదు. సంహిత అని రెడ్డిగారన్నారు. భారతం కావ్యమేనని. భారతం కంటే రామాయణం పూర్వమనే ఉపనిషత్తులను ప్రదర్శిస్తూ ఉమాకాంతంగారు వారించారు. ఆ సందర్భంగా "వాస్తవముగా సంఘమును సంస్కరింపవచ్చును. సర్వసమత్వము ప్రతిష్టించ యత్నించవచ్చును. వీటికన్నిటికి రామలింగా రెడ్దిగారు మరికొన్ని మార్గములు అవలంబించ వలసియున్నది గాని భారత వర్షేతిహాసములను గురించి భారతీయుల ప్రాచీన వాఙ్మయము గురించి తెలిసి తెలియని మాటలు మాట్లాడుట మాత్రము అనుచితమైన కార్యము" అని స్పష్టంగా నిర్భయంగా ప్రకటించారు.

'నైషధ తత్త్వ జిజ్ఞాస' అనేది సంస్కృత నైషధ కావ్యంపై విమర్శ శ్రీహర్షుని మేదాశక్తిని పాండిత్యాన్ని ప్రశంసిస్తూనే నైషధము ఉత్తమ కావ్యము కాదని తేల్చారు. శ్రీహర్షుని కాలానికి భారతదేశంలో శాస్త్ర పరిశ్రమ హెచ్చినదని కావ్య గుణం తగ్గిందని వివరించారు. "అది గొప్ప విమర్శనము బయలుదేరిన సమయము. గొప్ప కవిత్వము కుంటువడిన సమయము" అని అభిప్రాయ పడ్డారు. అందుకు కారణాలను అన్వేషిస్తూ "ఏనాడు అర్ధము యవన హస్తగతమైనదో ఆనాడే భారతీయుడు పరాధీనతను ప్రాపించెను.. ఆర్య సంప్రదాయములు క్రమక్రమముగా విచ్చిన్నము లాయెను. మహమ్మదీయుల విషయ లోలత్వము దేశమున వ్యాపింప జొచ్చెను." అని దేశపరిస్థితులను వివరించారు. భారతదేశ సాంస్కృతిక పతనానికి మహమ్మదీయులు కారణంగా భావింఛే ఒక ఆలోచనా ధోరణి మన దేశంలో చాలా కాలంగా ఉన్నది.