పుట:Neti-Kalapu-Kavitvam.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

86

వాఙ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం


ఆపటాలు రంజకంగా వుండవచ్చునుగాని మనం సౌందర్య జిజ్ఞాసువులమైతే పులుముడు రంగులపటాన్ని అధమమని నిరాకరిస్తాము. కృతుల్లోగూడా ఉత్తమకవులు కాళిదాసాదులు కొద్దిమాటల్లో అమేయార్ధాన్ని స్ఫురింపజేస్తారు. చెప్పినమాటల అర్థంకంటె ఆమాటలవల్ల స్ఫురించే భావవిశేషపరంపర అమేయమై గోచరిస్తూ వుంటుంది. తనమాటలను తాము నిల్పుకొన్నా నిల్పుకోకపోయినా

"అల్పాక్షరముల ననల్పార్ధరచన" (బసవ)

అని పాల్కురికి సోమన్న ఉత్తమకవిత్వాన్ని కీర్తించాడు

"యావదర్ధపదాం వాచమేవమాదాయ మాధవః
 విరరామ మహీయాంసః ప్రకృత్యా మితభాషిణః" (మాఘ)

(మాధవుడు కావలసినంతవరకే మాట్లాడి చాలించాడు గొప్పవారు ప్రకృతిచేతనే మితభాషులు ) అని ..

"నైతల్లఘ్వపి భూయస్యా వచో వాచాతిశియ్యతే
 ఇంధనౌఘధగప్యగ్నిః త్విషా నాత్యేతి పూషణం" (మాఘ)

(ఆసంభాషణ కొద్దిదైనప్పటికి విస్తరించివుండేమాటలు దాన్ని అతిశయించలేదు కట్టెలను మండించేదైనప్పటికీ కాంతిచేత అగ్ని సూర్యుణ్ణిమించదు). అని మాఘుడు రెండవసర్గలో మితోక్తుల మహిమను కొనియాడుతాడు.

లోకంలో సయితం సాధ్యమనంత కొద్దిశ్రమతో సాధ్యమైనంత గొప్పపనులు నిర్వహించడం ఉత్తమమార్గమనీ వృథాగా ధనం శక్తి వ్యయంచేయడం అధమమార్గమని ప్రసిద్ధంగానే వున్నది. విశిష్ట భావప్రపంచాన్ని గోచరింపజేసేది ఉత్తమకవిత్వమన్న సంగతి యిదివరకే నిరూపించాను. ఉత్తమమార్గానికి దూరులై గాఢంగా రంగులు పులిమే గుజిలీబ్నొమ్మల కర్తలవలె ఒక్క భావాని కెన్నోమాటలు గుప్పించి అర్థవిభుత్వాన్ని అంతంజేసి మాటలు దండగజేయడం పులమడం. దీన్నే వాచ్య మని అధమ మని భారతీయసాహిత్య వేత్తలు నిరసించారు.