పుట:Neti-Kalapu-Kavitvam.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xiii

విదేశయానం చేసినందుకు నడింపల్లి నరసింహారావు గారిపై తెచ్చిన అభియోగానికి ఉమాకాంతం గారు కోర్టులో సాక్ష్యం ఇచ్చారు. దాన్ని ఒక విమర్శన వ్యాసంగా రాస్తూ సముద్రయానం చెయ్యటం వల్ల పతితుడవుతాడనటానికి శాస్త్ర ప్రమాణం లేదని నిరూపించారు.

ఉమాకాంతం గారు సాహిత్యాంశాలపై తమ అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడించారు. ఎంతటి గొప్పవారి అభిప్రాయాలను ఖండించటానికైనా వెనుదీసె వారు కాదు. మద్రాసు విశ్వవిద్యాలయంలో 1923 సంవత్సరానికి పెట్టిన పురాణపండ మల్లయ్య శాస్త్రిగారి శుక్రనీతిని విమర్శిస్తూ 'బ్రదిమి ఏనిక దిగ్గియ ఒండె ఉలుపా ఎకిమీడు ' వంటి పాతబడ్ద మాటలను వాడటాన్ని నిరసించారు. ఆ పుస్తకానికి యోగ్యతా పత్ర మిచ్చిన జయంతి రామయ్య గారి స్వవచో వ్యాఘాతాలను ప్రదర్శించారు.

ఇంగ్లీషు పాఠ్య నిర్ణాయక సంఘంలో ప్రెసిడెన్సీ కాలేజిలో ఇంగ్లీషు బోదించే వారిని వేసి, తెలుగు పాఠ్య నిర్జాయక సంఘంలో తెలుగు బొధకులను వేయక పోవటాన్ని నిరసించారు.

విష్ణు చిత్తీయ వ్యాఖ్యాన సభలో వేదం వెంకటరాయశాస్త్రిగారు కట్టమంచి రామలింగారెడ్దిగారు వెలిబుచ్చిన అభిప్రాయాలతో తీవ్రంగా విభేదిస్తూ వాఙ్మయపత్రికలో వ్యాసాలు రాశారు. ఆముక్త మాల్యదలో చాలా గొట్టుమాటలున్నాయి కాబట్టి అది గొప్ప కావ్యం అయినట్టు వేదం వెంకటరాయశాస్త్రి గారన్నారని చెపుతూ ఆ మాటలందు నాకు ప్రమాణ బుద్ది కలగలేదు అన్నారు. మను చరిత్రలో రసాభాస ఉన్నది కాబట్టి దాన్ని మంచి కావ్యం కాదన గూడదన్నారు (అంతమాత్రం చేత మను చరిత్ర ఉత్తమ కావ్యమనికాదు ఇతర కారణాలు చూపించాలని ఆయన అభిప్రాయం) రసాభాస నిషిద్ధం కాదని అది అంగంగా ఉండవచ్చునని సిద్ధాంతం చేశారు. ఇంతకీ మనుచరిత్రలో ఉన్నది రసాభాసకాదని వరూధిని కది వాస్తవమేనని వాదించారు. ఆ సందర్భంలోనే మనుచరిత్రను పెద్దన రచించ లేదనీ కృష్ణరాయలు