పుట:Neti-Kalapu-Kavitvam.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xii

'ఉమాకాంతం గారు 1921 లో తెలుగు దేశ వాఙ్మయ పత్రికను స్థాపించి సంస్కృత వ్యాకరణ ప్రదీపం. పాణినీయ ఆంధ్ర వివరణం. రసమీమాంస నైషద తత్వ జిజ్ఞాస వంటి ప్రశస్త రచనలు వెలువరించారు' అని అక్కిరాజు రమాపతి రావుగారు రాశారు.

'లౌకిక దృష్టితో చెప్పుకోదగిన సంఘటన లేవీ ఆయన జీవితంలో లేవు పాండిత్యానికి తగిన శరీర దార్డ్యం ఆయన కెన్నడూ లేకపోయింది' అని అబ్బూరి రామకృష్ణారావు తెలుగు విజ్ఞానసర్వస్వంలో అన్నారు.

ఉమాకాంతంగారి రచనలపై సమగ్ర సమీక్ష జరగలేదు సంపూర్ణమైన అంచనా రాలేదు. ఆయన రచనలు దొరికినంత వరకూ (అన్నీ దొరకవు) పరిశీలిస్తే ఆయనకు తెలుగు సాహిత్యంపై నిర్ధిష్టమైన అభిప్రాయాలు విలక్షణమైన ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తున్నది. ఆయన రచనలన్నింటా తెలుగు సాహిత్య స్థితిని గూర్చి ఆవేదన కనిపిస్తుంది. ప్రచురణ వివరాలు దొరకలేదు గాని రమాపతి రావుగారి సౌజన్యం వల్ల ఆయన చిన్న చిన్న వ్యాసాలు కొన్ని దొరికాయి.

సాంఘికంగా ఆయనకు అబివృద్దికరభావాలే ఉన్నట్టు, సాంఘిక సంస్కరణలకు ఆయన అనుకూలుడే అయినట్టూ ఆయన కథలను బట్టేకాక ఆయన విడివిడి వ్యాసాలనుబట్టి కూడా చెప్పవచ్చు. 'తెలుగు దేశము నందలి చండాలురు' అనే వ్యాసంలో "చండాలురని చెప్పుటకు ఏ ప్రమాణమూ లేని మాదుగులను ఆంధ్రదేశము నందలి మొదటి తెగలగు చెంచులు బలిజెలు మొదలైన వారివంటి మాదుగులను అస్పృశ్యులుగా బాధించుచున్నాము ఊళ్ళనుండి బయటికి వెళ్ళగొట్టినాము. బావుల వద్దకు రానీయము. దేవాలయములలో ప్రవేశించనీయము. ఇంతకంటె తెలుగుదేశము ఆచరించుచున్న అధర్మము మఱియొకటిలేదు. ఈ దురాచారము అప్రామాణికమైనది అనర్ధహేతువైనది అని చెప్పుచున్నాను' అని నిర్ద్వంద్వంగా ప్రకటించారు.