పుట:Neetideepika Kandukuri Veeresalingam.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాఱుపనికిఁదాను మరలంగఁదగుఁగాని
పెక్కుపనులకొకట నిక్క రాదు. 95

ఆ. పెద్దవారలై నఁబిన్నవారైనను
జెప్పునట్టిపలుకుఁజెవిని జొనిపి,
యుక్తియుక్తమైన,నొయ్యన గ్రహియింపు;
కానిదైనఁగొనకమానుమీవు 96

తే. పలికిబొంకనిజిహ్వయుఁబాడిగలుగు
వర్తనమునకు బాపమొఱుఁగనిబాహువులును
బురుషునకు నెందుజారనిభూషణములు
కాని,విలువబట్టలు గావు,కావునగలు. 97

ఆ. తెల్లవార లేచి, దినమెల్ల మనచేయు
కర్మచయములోనఁ గర్మసాక్షి
ప్రతిదినంబు మంచిపనులఁ గొన్నిటిఁ
జూచిఁ యేగునట్టుగఁజరియింపవలయు. 98

ఆ. పరులునీకు నెట్లు వాంఛింతువోచేయ
బరుల కట్ల చేయవలయు నీవు;
సర్వశాస్త్రములను జర్చింపఁదేలెడు
సారమైనధర్మసరణి యిదియె. 99

తే. మేనుక్షణభంగురంబౌట, మానసమున
నుంచి, రేపుచేసెద నని యుంటమాన
వలయుఁ సద్ధర్మములనేఁడెసలుపవలయు
నెల్లి మనముందుమోలే మొయెఱుఁగరాదు. 100

తేగీ. ఇందుఁగలపాఠశాలలయందుఁజదువు
దిగువతరగతిబాలుర తెలిపి కొఱకు
నీతిదీపిక యను నూఱు గీతములను
కందుకూరి వీరేశలింగము రచించె.