పుట:Navanadhacharitra.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

33

నునుపారె నూరులు ◆ నూగారు మెఱసె
గొబ్బునఁ గలిమి గై ◆ కొనెఁ బేద నడుము
గుబ్బపాలిండ్లము ◆ క్కులు నల్పుమీఱెఁ
దెగగలకన్నుల ◆ తెలుపు రెట్టించె
జిగి ధగద్ధగయను ◆ చెక్కులు వలికె
వదనపద్మంబు మృ ◆ ద్వాసననెసఁగెఁ
బొదలెఁగోర్కులు చూలు ◆ బోణులుముట్టఁ
బరువడినిండారు ◆ పదియవనెలను
సురగురుఁ డేడవ ◆ చో నుండునంత
నుడురాజురాశి నా ◆ యుష్మంతుఁడైన
కొడు కుదయించె నా ◆ కుసుమకోమలికి
మనుజేశుఁ డపుడు స ◆ మ్మదమునఁ దేలి
ఘనరత్నములుఁ గన ◆ కములు మాడలును
భూసురోత్తములకు ◆ భూరిగా నొసఁగి
చేసెఁ బుత్రోత్సవ ◆ శ్రీబొగడొంద
నటుమీఁద సముచితం ◆ బగు దివసమునఁ
బటుబుద్ధి నెరయ న ◆ ప్పార్థివేశ్వరుఁడు
సారంగధరుఁడని ◆ చంద్రశేఖరుని
పే రిడి యాబాలుఁ ◆ బ్రియమునఁబిల్వఁ
బూటపూటకుఁ బెద్ద ◆ బోషించి ప్రేమఁ
[1]నాటినాటికి విదియ ◆ నాటిచందురుని
చెన్నొందఁగళలఁ బ్ర ◆ సిద్ధమై పెరుగు
చున్నయాతేజంబు ◆ నొరపురూపంబు
నెలప్రాయమును ముదం ◆ బెసఁగ వీక్షించి
కులశీలవిభవస ◆ ద్గుణములఁ దనకు
సరియైనఘూర్జరే ◆ శ్వరు కూర్మిపుత్రి
నరవిందముఖి మంగ ◆ ళాంగియన్ కన్యఁ
బరిణయం బొనరించి ◆ పరమసంతోష
భరితుఁడై నిజసభా ◆ భవనంబులోన
హితులు మంత్రులుఁ బురో ◆ హితులు గాయకులుఁ
జతురులౌ కవులును ◆ సమ్మతిఁ గొలువ
కొలువున్న తఱిఁగోర ◆ కొప్పిడిచెంప

  1. చంద్రుండు చెన్నొందు కళలఁబ్రసిద్ధుఁడై