పుట:Navanadhacharitra.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

22

నవనాథచరిత్ర

నలవడ, యోగంబు ◆ లాదిగాఁ గఱపి
కలుగు నభ్యాసయో◆గములెల్ల నేర్పి
యనుపమ రాజయో◆గామృతవార్ధి
నను వంద మత్స్యేంద్రుఁ ◆ డనువానిదృష్టి
వెరవుతో మరలించు ◆ విధ మెఱిఁగించి
తిరముగా వెలుపలఁ ◆ దెలుపులు దోఁప
వెలియును లోనును ◆ వీక్షించునట్టి
పొలుపుచూపియు ముఖాం◆బురుహంబు నొప్పు
నెపమున వినిపించి ◆ నిగమాదియైన
విపుల పదంబున ◆ వినుతికి నెక్కు
కోదండ గుణము ని◆క్కువముగాఁ దెలిపి
యాదరం బెసఁగఁ గృ◆తార్థుఁ గావింప
సకలవాదంబులు ◆ సకల సన్మణులు
సకల మంత్రంబులు ◆ సకలౌషధములు
సకల సంసిద్ధియు ◆ సమకొన నొసఁగి
యకలంక చరిత నీ ◆ వతులిత మహిమ
దీపింప నఖిల సత్ ◆ సిద్ధులకెల్ల
నేపార గురుఁడవై ◆ యెసఁగుచునుండు
మని పల్కి శంకరుఁ ◆ డతనికి నామ
మొనరింపఁ దలఁచి మీ ◆ నోదరంబునను
మును వసించిన నెప ◆ మున మీననాథుఁ
డనఁగ నెల్లందుఁ బ్ర◆ఖ్యాతి వహించి
విమలగుణాధార ◆ వెలయు నీవింకఁ
గ్రమమున ధరణిపైఁ ◆ గల తీర్థములును
నదులును నద్రులు ◆ నారణ్యములును
జెదరక తపములఁ ◆ జేయు సన్మునుల
యాశ్రమంబులును దే◆వాలయంబులును
నశ్రమంబునఁ జూచి ◆ యటమీఁద మెలఁగు
భయమును బొరయక ◆ పరిణామ మెసఁగ
నయమునఁ బ్రజల సం◆తసమునఁ బ్రోచు
జనపాలతిలకు దే◆శముల నొక్కొక్క
ఘన మహీధరము పైఁ◆గడురమ్యమైన
గుహ నివాసము చేసి ◆ కొని ధృతి మీఱ