పుట:Navanadhacharitra.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10

నవనాథచరిత్ర

మోతుకు మొగ్గల ◆ మురువు నటించు
నెలవంక ముక్కుల ◆ నేర్పునఁ జించి
తొలితొలి ఫలములఁ ◆ దొరఁగు రసంబు
లరగన్ను వెట్టుచు ◆ నందంద క్రోలి
బిరుదెక్కి కడు జిగి ◆ బిగిఁ బొనరించి
భావజు సురదాణి ◆ పచ్చపక్కెరల
మావులు రవళించు ◆ మాడ్కినిఁ జెలఁగెఁ
ద్రిజగంబులును గెల్వఁ ◆ దివురు మన్మథుని
విజయశంఖము లొత్తు ◆ విధమున మిగులఁ
బొగ డొంది వికసించు ◆ బొండుమల్లియల
మొగడలవై నుండి ◆ మొరసెఁ దుమ్మెదలు
పొలుచు సుధారసం ◆ బునఁ జాల నాని
మొలచినముత్యంపు ◆ మొలకలో యనఁగఁ
జలిమించు లుమియుబి • స ప్రరోహములు
వెలయ [1] లప్పలు మేసి ◆ వేడుకం బ్రియల
రమణమై గవిసె మ ◆ రాళసంతతులు
[2]సమరతికాంక్షలు ◆ సలుపు వల్లభుల
ముందటఁ గ్రీడించి ◆ మురియుచు వలపు
లొందంగ [3]మరుఁబను ◆ లొనరించు వేడ్క
దగిలించి రతులకుఁ ◆ దరితీపు సేసి
దగిలెఁ జక్కవలు గెం ◆ దమ్మి దీర్ఘికలఁ
బరగు[4] నేలాలతా ◆ భవనాంతరమున
నరుణ ప్రవాళ శ ◆ య్యలమీఁదఁ బ్రియులఁ
గొసరుచు నుపరతిఁ ◆ గూడి క్రీడించి
యసురసురైయున్న ◆ యప్సరఃస్త్రీల
చెక్కుల నెసఁగులేఁ ◆ జెమట లార్పుచును
జొక్కుమై వీతెంచె ◆ సోమరిగాలి
దొలకరి మెఱుఁగులఁ ◆ దొలఁచు ముత్యాల
తళుకులు వెలిచిన ◆ తళతళ మించు
వలరాజుసతిచేతి ◆ వజ్ర దర్పణము
పొలుపున మెఱుఁ గెక్కెఁ ◆ బూర్ణ చంద్రుండు
ఆవేళ బరమేశుఁ ◆ డారజతాద్రి

  1. పంపులు.
  2. సంమతి
  3. గురుబసలొనరించు వెనుక.
  4. నేలోలతభ.