పుట:Navanadhacharitra.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

9

జిగి దప్పి చెఱఁగులు ◆ చిరుబీట లెత్తి
పగులుచు బిరుసనై ◆ పలఁకిన నాటఁ
దొడిమెలు వడి వాడఁ ◆ దుదగాలిఁ దూలి
కడువడి నందంద ◆ కారాకు రాలె
గుమురులు నయ మెక్కి ◆ క్రొమ్మోసు లొదవి
కొమరార నిగురొత్తి ◆ కెంపు సొం పెసఁగి
మట్టంపుఁ జిగురురె ◆ మ్మలు తొంగలించి
దట్టంపు నన లొత్తి ◆ తళతళ మించు
మొగ్గల నేచి బల్ ◆ మొగడలఁ ద్రోచి
దిగ్గన వికసించి ◆ తెలుపొందు విరుల
వలుఁదగుత్తుల నెత్తు ◆ వలపుల మించి
నలికంపుఁ బూపలై ◆ నలి నొగ లెక్కి
కాయలై పులుసున ◆ గరిగట్టఁ గలిగి
పాయక ఫలములై ◆ పదియాఱు వన్నె
బంగారు చాయ రాఁ ◆ బండిన పండ్లు
పొంగారు కొమ్మల ◆ [1]పొలుపున వీఁగు
వనమహీరుహములు ◆ వరుసఁ బెంపెసఁగె
మనమున [2] నెచరించి ◆ మగకోకిలములు
ముక్కులు ఱెక్కలు ◆ మురువుగాఁ దీర్చి
చొక్కంపు లేమావి ◆ సుదకొమ్మ లెక్కి
సెలసి లేఁగొన లెత్తి ◆ సెలవులఁ ద్రుంచి
కలగొన [3] లుకలుక ◆ గానప్పళించి
రసము పిచ్చిలఁ గూర్చి ◆ రమణుల కిచ్చి
మసలక తొలి చవుల్ ◆ మరపి మోహించి
నిక్కించి తమకముల్ ◆ నెరయఁ గూటములఁ
జొక్కించి పంచమ ◆ శ్రుతిఁ బిసాళించి
ముదముసఁ జెలఁగించె ◆ ముద్దుఁ గీరములు
మదగజకుంభసం ◆ భవ మౌక్తికముల
జిగి దువాళించు మిం ◆ చిన ద్రాక్షపండ్ల
పొగడొందు గుత్తుల ◆ [4]ప్రోవులు వెదకి
జాతిగా గళములు ◆ చాఁచి చెలంగి

  1. “పెంపునవిరిగి'
  2. ఎచరించు ఈకవియే యిందు మూఁడవ యాశ్వాసమునఁ బ్రయోగించెను.
  3. నలుకలుకగా కలునప్ప
  4. పువ్వులు.