పుట:Navanadhacharitra.pdf/299

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమా శ్వాసము

263

బంధురకీర్తి సౌ ◆ భాగ్య సంపన్నుఁ
డతి ధైర్యశాలి మ ◆ హాదాన శీలి
వితత తేజుఁడు వైరి ◆ వీర భీకరుఁడు
సకల కళావేది ◆ సన్మార్గ [1]చారుఁ
డక లంకమతి విన ◆ యాన్వితుం డన్య
భామినీదూరుఁ డ ◆ ప్రతిమప్రతాప
ధాముఁడు గృష్ణ కం ◆ ధార భూపాలుఁ
డతఁ డతినియతిమై ◆ సర్ఘ్యతోయములు
ప్రతిదినంబును హేమ ◆ పాత్రిక నునిచి
తనకు నందించినఁ ◆ దరణి గైకొనుచుఁ
జను నభంబునకుఁ ద్రి ◆ సంధ్యలయందు
సురలు తచ్చరితంబు ◆ చూచి హర్షించి
గురుమతి నభివృద్ధి ◆ గోరుచుండుదురు
ఇట్టి మాహాత్మ్యంబు ◆ నిట్టి వైభవము
నిట్టి భాగ్యము లోక ◆ మెల్ల నుతింప
నుర్వి పాలింపుచు ◆ నుండి యారాజు
సర్వజ్ఞుఁ డొకనాఁడు ◆ సౌధాగ్రసీమ
నిలిచి నాగరలోక ◆ నియత ప్రచార
మెలమిమై వీక్షించు ◆ నెడ [2]మాదిఁ గాని
నెలఁతుక నగ్నయై ◆ నీరాడుదాని
లలిత లావణ్య వి ◆ లాస భావములు
తప్పక కన్గొని ◆ [3]దర్ప కాస్త్రముల
యొప్పున నిజ ధైర్య ◆ మూఁతయుఁ దప్పి
తన పెంపుఁ దొల్లిటి ◆ తగవును మఱచి
మనమునఁ దత్సంగ ◆ మంబు వాంఛింప
నమ్మఱునాఁడు సం ◆ ధ్యా సమయమున
నిమ్ముల నానృపుఁ ◆ డిచ్చు సర్ఘ్యములు
ముందటి వలెఁ బ్రియం ◆ బున నేగుదెంచి
యందుకొనండయ్యె ◆ నరవిందమిత్రుఁ
డది గనుఁగొని ఖిన్నుఁ ◆ డై యతఁడాత్మ
నిది యేమి చిత్రమో ◆ యినుఁడు నావలన
నెఱువైన కృపఁదప్పె ◆ నేఁడింక నేది

  1. నరసిండకలంక.
  2. నెడమదిదాని.
  3. ధర్మశాస్త్రముల.