పుట:Navanadhacharitra.pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

228

నవనాథచరిత్ర

నూరక బిగిసియు ◆ నుంటి నావలని
నేరమి లోఁగొని ◆ నిండారు కరుణ
నవలోకనము సేయు ◆ మనుచు నందంద
యవనిఁ జాఁగిలి మ్రొక్కి ◆ హస్తముల్ మొగిచి
భయభక్తులొదవఁ ద ◆ త్పాదపద్మముల
పయిఁ దనఫాలంబుఁ ◆ బలుమాఱు గదియ
మ్రొక్కుచునుండె న ◆ ప్పుడు గుహేశ్వరుఁడు
గ్రక్కున నెరయఁ గ్రాఁ ◆ గిన యట్టి పదను
గని లోహ మదికిన ◆ కరణి గోరక్షు
ఘనభావపరిపాక ◆ గతియును మంచి
తనమును దెలిసి యీ ◆ తని కుపదేశ
మొనరింతు నింకని ◆ యుల్లంబులోన
నెసఁగిన కృపఁబ్రియం ◆ బెసఁగంగ నతని
నొసలంటి మన్నన ◆ నూల్కొన నెత్త
నా గుహేశ్వరు కరు ◆ ణావలోకనము
పైఁగీలుకొన నంతఁ ◆ బాసె గోరక్షు
మదమత్సరములు సం ◆ భాషణం జేసి
మది మఱపెల్ల గ్ర ◆ మ్మఱ మ్రగ్గిపోయెఁ
గరమునఁ బట్టిన ◆ కాయంబునందుఁ
దిరమైన మాయయుఁ ◆ దిగ్గనఁ దొలఁగె
మరి నిర్మలంబైన ◆ మనసునుం దనువు
దొరికె నాతనికి సం ◆ తోషంబు నెరయఁ
దోరంపుఁ బులకలు ◆ తోరణశ్రేణు
'లై రమ్యముగఁ దన ◆ యంతరంగమునఁ
గింకరత్వముఁ బూని ◆ గిరికొన్న భక్తి
నంకించి యా కరు ◆ ణామృత జలధి
నోమహామహిమ స ◆ ర్వోన్నత చరిత
యేమార్గమున నిల్తు ◆ నింక నే ననిన
నాలించి వినుమని ◆ యాతనితోడ
లీలనప్పుడు ప్రభు ◆ లింగ మిట్లనియె
నీదేహకాఠిన్య ◆ మీదేహసిద్ధి
భేదమింతియె కాని ◆ పృథునిత్యముక్తి
సిద్ధియీగతిఁ గాదు ◆ చెనటి దురాశ