పుట:Navanadhacharitra.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

200

నవనాథచరిత్ర

ధళధళ మించు సౌ ◆ ధముల శృంగార
వనములఁ జెఱువుల ◆ వనజ దీర్ఘికల
మనసిజ మోహన ◆ మంత్ర దేవతల
మురువునఁ జెన్నారు ◆ ముదతలం గలిగి
పరుల కసాధ్యమై ◆ పరఁగు నయోధ్యఁ
జూచి యన్నగరంబుఁ ◆ జొచ్చి శిష్యులకు
నేచిన వేడ్క మ ◆ త్స్యేంద్రుఁ డిట్లనియె
నెలమి నీ పురము ము ◆ న్నే లెడి రాజు
జలరుహ మిత్రవం ◆ శ ప్రదీపకుఁడు
దశరథరాముఁడు ◆ దనపిన్ననాఁడు
దిశల సత్కీర్తి చం ◆ ద్రిక లుల్ల సిల్ల
తాటకి నొకకోల ◆ ధరఁగూల నేసె
చాటువగాఁగ వి ◆ శ్వామిత్రు ముఖము
గాచి సుబాహుని ◆ ఖండించి ఫాల
లోచనువిలు ద్రుంచి ◆ లోలత సీతఁ
బరిణయంబై పటు ◆ బాణ విక్రమునిఁ
బరశురాముని భంగ ◆ పఱచి కబంధు
నదటార్చి ఖరదూష ◆ ణాది రాక్షసుల
కదనరంగంబునఁ ◆ గాలునిఁ గూర్చి
బలియుని సుగ్రీవు ◆ బంటుగా నేలి
బలభేది తనయుని ◆ బాణ మొక్కటను
దునుమాడి యవలీలఁ ◆ దోయజగంధి
జనకజఁ జెఱఁగొన్న ◆ చనటి, రాక్షసుని
శిరములు చెండాడి ◆ సీతఁదోడ్కొనుచుఁ
దిరిగి యయోధ్య కే ◆ తెంచి యారాజ్య
మరుదుగా నొనరించు ◆ నంత కాలమును
....... ....... ...... ....... ....... ....... ....... ........
నపమృత్యుభయము న ◆ న్యాయ వర్తనము
కపటంబు మరి శత్రు ◆ ఘాతము లేక
తల్లియుఁ దండ్రియుఁ ◆ [1]దానెయై యేలె
నెల్లభూప్రజలఁ బెం ◆ పెసగిన కరుణ
నని మహాపాతక ◆ హరమైన రాము

  1. దానెయైయపుడు.