పుట:Navanadhacharitra.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

182

నవనాథచరిత్ర

సిద్దులఁ దలఁపునఁ ◆ జింతింప మఱచి
రాగిల్లి యుండ గో ◆ రక్షుఁడు మొదలు
గాఁగల శిష్యవ ◆ ర్గము దమలోనఁ
దలపోసి గురుఁడు నం ◆ తత రాజ్యభోగ
ములఁజిక్కి మఱచె ని ◆ ప్పుడును మనలను
గడుఁబెద్ద కాలమీ ◆ కల్యాణ తనువు
కడనుండి దరలకు ◆ కాచి యుండితిమి
ముదమున నమ్మహా ◆ త్ముని కడకేగి
వదలక తోడితే ◆ వలె నింక ననఁగఁ
జౌరంగికార్యంబు ◆ చర్చించి చూచి
గోరక్షునాథుఁ గ ◆ న్గొని యిట్టు లనియె
నరనుతుఁడగు మీన ◆ నాథు దేహంబు
కరమర్థిమే మిటు ◆ గాచియుండెదము
కొదుకక చని నీవు ◆ గురునాథునాత్మఁ
గదియింపు నీదివ్య ◆ కాయంబుతోడ
గురుఁడు మాకందఱ ◆ కును ముఖ్యుఁడైనఁ
గరుణించి తమయందుఁ ◆ గల మహత్వంబు
నెమ్మితో నీయందు ◆ నిలిపెఁగావునను
సమ్మదంబున మీరె ◆ చను టిప్పు డుచిత
మనితన్నుఁబ్రార్జింప ◆ నగుఁగాకయనుచుఁ
దనగురునాథుని ◆ తను వొప్పగించి
యచ్చోటుగదలి స ◆ య్యనఁ బట్టణంబు
చొచ్చే నవ్వేళ నా ◆ క్షోణీవిభుండు
పరిపరివిధములఁ ◆ బాదరసంబు
కరణి భంజళ్లఁ ద్రొ ◆ క్కని చోట్లు ద్రొక్కు
తురఁగరత్నము నెక్కి ◆ తూర్యముల్ మ్రోయఁ
గరులును భటులును ◆ గవులు గాయకులు
దొరలు ప్రధానులు ◆ తోఁ జనుదేర
నరుదుగా వయ్యాళి ◆ కరుగంగఁగాంచి
మరలియే తేరఁ ద ◆ న్మార్గంబునందు
మరులువేషముపూని ◆ మాసినచిక్కు
తలయును జింపిబొం ◆ తయు శునకములు
నొలయు గోలయుఁ జేత ◆ నున్న పుఱ్ఱెయును